పీకే ఏమైనా బ్రహ్మనా? బొత్స లాజిక్ మిస్ ?

నచ్చినోళ్లను నెత్తిన ఎక్కించుకోవటం.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేసినట్లుగా మాటలు మాట్లాడటం ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. రాజకీయాల్లో ఈ ధోరణి ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. మరి.. ముఖ్యంగా ఏపీ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

రాజకీయం కాస్తా వ్యక్తిగత వైరంగా మారిన వేళ.. తమకు తగ్గట్లుగా మాట్లాడితే సరి. లేదంటే.. వారెవరైనా.. ఏ స్థాయి అయినా వెనుకా ముందు చూసుకోకుండా నోరు పారేసుకుంటున్న తీరు ఎక్కువ అవుతోంది.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూటమి విజయం సాధించటం ఖాయమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.

ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పిన ఆయన.. రీసెంట్ గా మరో ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఏపీలో ఎవరు విజయం సాధిస్తారన్న విషయాన్ని చెబుతూ.. జగన్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు లేదని స్పష్టం చేశారు.

పీకే వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేద్దామన్న ధోరణిని పలువురు ప్రదర్శిస్తుంటే.. మంత్రి బొత్స మాత్రం అందుకు భిన్నంగా పీకే వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

ప్రశాంత్ కిషోర్ ఏమైనా? బ్రహ్మనా? ఎన్నిసీట్లు వస్తాయో చెప్పటానికి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఎదుటోళ్లను మనం ఒకమాట అంటే.. మనల్ని రెండు మాటలు అనే వీలుంటుంది కదా? అందులోకి బొత్స లాంటి వాళ్లు మాట్లాడే మాటల్లో లాజిక్ లేకుండా.. ఏదో ఒకటి అనటమే ముఖ్యమన్నట్లుగా టార్గెట్ చేయటం అసలుకు ఎసరుగా మారిందంటున్నారు.

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? సీట్లు ఎవరెన్ని సాధిస్తారు? అనే అంశం మీద ఎవరి అంచనాలు వారివి ఉంటాయి. అధికార వైసీపీ ఎలా అయితే 151 సీట్లకు పైనే వస్తాయని అంచనా వేసుకుంటారో.. అదే రీతిలో అందుకు భిన్నమైన అంచనాలు వినిపించేటోళ్లు ఉంటారు. ఎవరి అంచనా వారిది. అలాంటప్పుడు మనం ఎదుటోళ్ల అంచనాను ఎగతాళి చేస్తే.. తమ అంచనాల్ని సైతం అలానే చేసే వీలుందన్న విషయాన్ని బొత్స ఎందుకు మర్చిపోయారు? అన్నది ప్రశ్న.

పీకేను ఒక మాట అనేసిన బొత్స.. తాను భారీ పంచ్ ఇచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ.. తమ పార్టీ అధినేత మొదలు కొని పలువురు నేతలు తమకు వచ్చే సీట్లు ఎన్ని అన్న దానిపై భారీగా చెప్పటం తెలిసిందే. మరి.. బొత్స అన్న మాటను వైసీపీ అండ్ కోను కూడా అనేయొచ్చుగా? పీకే ఏమైనా బ్రహ్మనా అనే బొత్సను.. మరి బొత్స ఏమైనా బ్రహ్మనా? అనే మాటకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా? మరి..దాని సంగతేంటి? అన్నది ప్రశ్న.