ఏడాదిలోపు నేతల జాతకాలు తేలుతాయా ? సాధ్యమేనా ?

నేరచరితులను చట్టసభల్లోకి అడుగుపెట్టనీయకూడదన్న విషయంలో రెండో ఆలోచనకు తావులేదు. కానీ మన ప్రజాస్వామ్యంలో అది సాధ్యమేనా ? ఎందుకంటే నేరచరితులు లేని రాజకీయ పార్టీలు దాదాపు మనదేశంలో లేవనే చెప్పాలి. కేంద్రంలో ప్రస్తుతం పాలిస్తున్న ఎన్డీఏని తీసుకున్నా ప్రధాన ప్రతిపక్షమైన యూపిఏలో అయినా ఇదే సమస్య. రెండు కూటముల్లోని పార్టీల్లో వందలాది మంది ఎంపిలపై కేసులున్నాయి. అలాగే ఏ రాష్ట్రంలో తీసుకున్నా అధికార, ప్రతిపక్షాల్లోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామందిపై కేసులున్న మాట వాస్తవం.

మిగిలిన రాష్ట్రాల సంగతిని పక్కనపెట్టేసినా ఏపిలో 175 మంది, తెలంగాణాలో 118 మంది ఎంపిలు, ఎంఎల్ఏలపై కేసులున్నాయి. కేసులున్న వాళ్ళల్లో వైసిపి, టిడిపి, వామపక్షాలు, బిజెపి నేతలున్నారు. అలాగే తెలంగాణాలో కూడా టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలపై అనేక కేసులున్నాయి. సరే వీళ్ళ విషయాన్ని పక్కనపెట్టేస్తే కేంద్రంలో ఎన్డీఏకి నేతృత్వం వహిస్తున్న బిజెపిలోని చాలామంది మంత్రులు, ఎంపిలపై ఎన్నో కేసులున్నాయి. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం కేంద్రమంత్రుల్లో సుమారు 16 మందిపై కేసులున్నాయట.

సుప్రింకోర్టు తాజాగా బయటపెట్టిన లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4600 మంది ప్రజాప్రతినిధులుపై క్రిమినల్ కేసులున్నాయి. మరి వీళ్ళందరిపైన నమోదైన కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తిచేయటం సాధ్యంకాదని బిజెపి నేతలే చెబుతున్నారు. ఒక్కో కేసును విడివిడిగా విచారణ చేపట్టాలన్నపుడు ఎంతోమంది సాక్ష్యులను ప్రశ్నించాల్సుంటుందని బిజెపి నేత, న్యాయవాది ఉమామహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి న్యాయవ్యవస్ధకున్న సాదన సంపత్తి ప్రకారం చూస్తే ఏడాదిలోగా నేరచరితులైన ప్రజాప్రతినిధుల కేసుల విచారణ సాధ్యం కాదన్నారు.

పైగా నేరచరితులైన నేతలు కేవలం ప్రతిపక్షాల్లో మాత్రమే ఉండుంటే విషయం వేరేగా ఉండేది. కానీ కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపిలో కూడా వందలాదిమంది నేరచరితులు మంత్రులుగా, ఎంపిలు, ఎంఎల్ఏలుగా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తమ పదవులను పోగొట్టుకోవటానికి ఇష్టపడరన్నది వాస్తవం. నిజంగా చట్టసభల్లో నేరచరితులు ఉండకూడదనే అందరు కోరుకోవాలి. కానీ మనదేశంలో ప్రాక్టికల్ గా అది సాధ్యమేనా ? అన్నది కూడా కీలకమే. సరే ఏదేమైనా సుప్రింకోర్టు తీసుకున్న తాజా నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందే చూద్దాం ఏమవుతుందో.