ఆర్ ట్యాక్‌, యూ ట్యాక్స్ అంటా..

అవినీతి, కుంభ‌కోణాలంటూ తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగిస్తూనే ఉంది. ఇక్క‌డి సంప‌ద‌నంతా కాంగ్రెస్ నాయ‌కులు దోచుకుంటున్నార‌ని ఆరోపిస్తూనే ఉంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని మోడీ, అమిత్ షా త‌దిత‌ర బీజేపీ అగ్ర‌శ్రేణి నేత‌లంతా కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ వ‌సూలు చేస్తోంద‌ని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. దీంతో ఆ పార్టీ స్థానిక నేత‌లు కొత్త ప్ర‌చారం ఎత్తుకున్నారు. ఇప్పుడు యూ ట్యాక్స్ అంటూ కాంగ్రెస్‌ పై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. యూ ట్యాక్స్‌ అంటే ఉత్త‌మ్ కుమార్ ట్యాక్స్ అంటూ అర్థం చెబుతున్నారు.

బీజేపీ శాస‌నస‌భా ప‌క్ష‌నేత మ‌హేశ్వ‌ర్‌రెడ్డి తాజాగా ఈ ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ‌లో ఆర్ ట్యాక్స్‌తో పాటు యూ ట్యాక్స్ కూడా వ‌సూలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. యూ ట్యాక్స్ పేరిటి రూ.950 కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ డ‌బ్బుల్లో రూ.500 కోట్ల‌ను కేసీ వేణుగోపాల్‌కు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఇచ్చార‌న్న‌ది వాస్తవం కాదా అని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఇత‌ర కాంగ్రెస్ నాయ‌కుల కంటే త‌న‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ద‌క్కాల‌నే ఉత్త‌మ్ ఇలా చేశారని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు.

మ‌రోవైపు ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో రైస్ మిల్ల‌ర్లు కుమ్మ‌క్క‌య్యార‌ని మ‌హేశ్వ‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఉత్త‌మ్‌కు రైస్ మిల్ల‌ర్లు రూ.450 కోట్లు చెల్లించార‌న్నారు. కానీ ఈ ఆరోప‌ణ‌ల‌ను ఉత్త‌మ్ ఖండించారు. కేవ‌లం పేరు కోసం, పాపులారిటీ కోస‌మే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఉత్త‌మ్ అన్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో లేన‌ని, వ‌చ్చాక త‌గిన స‌మ‌ధానం చెబుతాన‌ని ఉత్త‌మ్ పేర్కొన్నారు. మ‌రోవైపు బీజేపీకి ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ నేత‌ల‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు కౌంట‌ర్ ఇస్తున్నాయి. ఆర్ ట్యాక్‌, యూ ట్యాక్స్ అంటూ బీజేపీ నేత‌లు లాజిక్ లేని మాట‌లు మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ ఫైర్ అవుతోంది.