ఈ ఏపీ బీజేపీ లీడ‌ర్లు ఎక్క‌డ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల హ‌డావుడి ముగిసింది. ఇక ఫ‌లితాల కోసం నిరీక్ష‌ణే ముగిసింది. ఎవ‌రికి వారు రిజ‌ల్ట్‌పై న‌మ్మ‌కంతో ఉన్నారు. అధికార వైసీపీ మ‌రోసారి గ‌ద్దెనెక్కుతుందా? లేదా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌స్తుందా? అన్న‌ది జూన్ 4న తేలుతుంది. ఈ లోగా నాయ‌కులు రిలాక్స్ అవుతున్నారు. కానీ బీజేపీలోని కొంత‌మంది లీడ‌ర్లు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ అట్టిముట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వీళ్ల ప్లాన్ ఏమిట‌న్న‌ది కూడా స‌స్పెన్స్‌గానే ఉంది. ఆ నాయ‌కులే సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి, జీవీఎల్ న‌ర‌సింహారావు.

బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షుడు అయిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సోము వీర్రాజు ఎక్కువ‌గా క‌నిపించ‌లేదు. మొద‌టి నుంచి టీడీపీతో పొత్తును ఆయ‌న వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. కానీ అధిష్టానం నిర్ణ‌యాన్ని కాద‌న‌లేక మిన్న‌కుండిపోయారు. అంతే కాకుండా ఎన్నిల‌క నేప‌థ్యంలో అభ్య‌ర్థుల ఎంపిక‌, నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంచుకున్న తీరు త‌దిత‌ర ప‌రిణామాలు వీర్రాజుకు న‌చ్చ‌లేద‌ని తెలిసింది. దీంతో ఆయ‌న సైలెంట్‌గానే ఉండిపోయారు. రాజ‌మండ్రి నుంచి బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి పోటీ చేసినా వీర్రాజు పెద్ద‌గా యాక్టివ్‌గా క‌నిపించ‌లేదు.

ఇక క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మౌనం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న హిందూపురం నుంచి పోటీ చేయాల‌ని భావించారు. కానీ పొత్తులో భాగంగా టికెట్ ద‌క్కే ప‌రిస్థితి లేకుండాపోయింది. దీంతో తీవ్ర నిరాశ వ్య‌క్తం చేశారు. టీడీపీ, జ‌న‌సేన మ్యానిఫెస్టోతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కూడా చెప్పారు. మ‌రోవైపు మొన్న‌టివ‌ర‌కూ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా అంతే. విశాఖ టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న కేవ‌లం ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌ట్లు క‌నిపించారు.