ట్విస్ట్.! పులివెందులపై పెరిగిన బెట్టింగులు.!

కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోతారు.. మంగళగిరిలో నారా లోకేష్ ఓటమి ఖాయం.. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోయేలా వున్నారు.. ఇలా వైసీపీ చెబుతున్నా, పులివెందులలో వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి.? అన్న అయోమయం, వైసీపీ శ్రేణుల్లో షురూ అయ్యింది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పులివెందులలో వచ్చే ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి వస్తాయ్.. అని టీడీపీ, జనసేన బలంగా చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్ మారింది. పులివెందులలో వైఎస్ జగన్ ఓడిపోతున్నారన్న ప్రచారానికి తెరలేచింది.

కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అన్న చందాన, ‘కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు..’ అన్న ప్రచారానికి విరుగుడుగా, ‘పులివెందులలో వైఎస్ జగన్ ఓటమి..’ అనే ప్రచారానికి తెరలేపింది టీడీపీ. జనసేన కూడా ఈ వాదనతో గొంతు కలపడం గమనార్హం.

నిజానికి, ఈసారి పులివెందులలో గెలవడానికి వైఎస్ జగన్ చాలా శ్రమించాల్సి వచ్చింది. వైఎస్ జగన్ సతీమణి భారతి, గడప గడపకీ వెళ్ళి, తన భర్తను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.

మరోపక్క, పులివెందులలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా, ఓటర్లకు డబ్బు పంపిణీ అనూహ్యమైన స్థాయిలో జరిగింది. ఓ వైపు జగన్ సోదరి షర్మిల నుంచి ఎదురవుతున్న తలనొప్పులు, ఇంకో వైపు కూటమి బలం.. ఈ రెండూ వైసీపీకి పులివెందులలో షాక్ ఇచ్చేలా వున్నాయ్.

ఈ క్రమంలోనే, పులివెందుల ఫలితంపై బెట్టింగులు గత కొద్ది రోజుల్లో అనూహ్యంగా పెరిగాయి. వైఎస్ జగన్ ఓడిపోతారన్న కోణంలో బెట్టింగులు నడుస్తున్నాయట. భారీగా సొమ్ము చేతులు మారుతోందిట. ఉభయ గోదావరి, కృష్ణా అలాగే గుంటూరు జిల్లాల్లో ఈ మేరకు బెట్టింగులు నడుస్తుండడం గమనార్హం.