పిన్నెల్లిపై అన‌ర్హ‌త వేటు? ఈసీ సీరియ‌స్‌!

వైసీపీ ఎమ్మెల్యే, మాచ‌ర్ల శాసన స‌భ్యుడు పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి పై అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ఈ నెల 13న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో అనేక హింసాత్మక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

వాస్త‌వానికి ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని అత్యంత స‌మ‌స్యాత్మ‌కంగా ప్ర‌క‌టించిన ఈసీ.. అన్ని పోలింగ్ బూతుల్లోనూ.. వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. అంటే.. ఇక్క‌డ చీమ చిటుక్కుమ‌న్నా.. ప‌ట్టేసేలా.. అంత్యంత శ‌క్తిమంత‌మైన సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేశాయి. అయిన‌ప్ప‌టి.. ఎమ్మెల్యే పిన్నెల్లి వ‌ర్గం మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ఎమ్మెల్యే సోద‌రుడు స‌హా.. ఆయ‌న అనుచ‌రులు కూడా ఈ అరాచ‌కాల్లో పాల్గొన్నారు. ఇక‌, తాజాగా స్వ‌యంగా ఎమ్మెల్యేనే అరాచ‌కం చేసిన వ్య‌వ‌హారం వెలుగు చూసింది. సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్‌ల‌ను ప‌రిశీలించిన ఎన్నిక‌ల అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లి ఓ పోలింగ్ బూత్‌లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించ‌డం.. నేరుగా ఈవీఎం మిష‌న్ ఉన్న చోట‌కు వెళ్లి.. దానిని ఎత్తి నేల‌కేసి కొట్ట‌డం.. వీవీప్యాట్‌ల‌ను ధ్వంసం చేయ‌డం వంటివి సీసీటీవీల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఆ వెంట‌నే వీటిని రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించారు. ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

త‌క్ష‌ణం పిన్నెల్లిపై కేసులు న‌మోదు చేయాల‌ని.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం రాత్రికి రాత్రి.. ఆయా కేసుల్లో ఇప్ప‌టికే న‌మోదు చేసిన రికార్డుల‌ను పోలీసులు మార్చారు. పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి, ఆయ‌న సోద‌రుడి పేరును కూడా చేర్చారు. హ‌త్యాయ‌త్నం 307 సెక్ష‌న్‌లు కూడా జోడించారు. దీంతో పిన్నెల్లి ని ఏ క్ష‌ణ‌మైనా అరెస్టు చేసే అవ‌కాశం ఉంది. ఇదిలావుంటే.. టీడీపీ నాయ‌కుడు, మాచ‌ర్ల అభ్య‌ర్థి జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డి.. మాచ‌ర్ల‌లో విధ్వంసానికి పాల్ప‌డిన పిన్నెల్లిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలని కోరుతూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విన్న‌వించారు. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న‌ను అన‌ర్హుడిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.