వైసీపీ రెబల్ ఎంపీ, ప్రస్తుత టీడీపీ నాయకుడు, ఉండి నియోజకవర్గం అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు నోటి వెంట.. రిటర్న్ గిఫ్ట్ అనే మాట బయటకు వచ్చింది. అది కూడా.. సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఇప్పటి వరకు రఘురామ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్య రాలేదు. అయితే.. ఇప్పుడు ఎన్నికల కౌంటింగుకు ముందు ఇలాంటి మాట రావడంతో ఆయన వ్యూహం ఏంటి? అసలు విషయం ఏంటి? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
ఎందుకింత కసి?
ప్రస్తుతం ముగిసిన ఎన్నికల్లో రఘరామ నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. బీజేపీ తనకు టికెట్ ఇస్తుందని కూడా ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోగా..అసలు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిపోయారు. మరోవైపు.. చిట్టచివరి నిముషం వరకు కూడా చంద్రబాబు ఆయన కోసం ప్రయత్నించారు. చివరకు బీజేపీ ఎవరి మాట వినకపోవడంతో చంద్రబాబు సాహసం చేసి ఉండి అసెంబ్లీ టికెట్‌ను ఇచ్చారు. అయితే.. ఇలా.. తనను బీజేపీ పక్కన పెట్టడానికి కారణం.. సీఎం జగనేనని. అప్పట్లోనే రఘురామ ఆరోపించారు. అందుకే తనకు నరసాపురం టికెట్ ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. ఇదే ఆయనలో కసిని పెంచింది.
ఏంటీ రిటర్న్ గిఫ్ట్
తాజాగా రఘురామ చేసిన రిటర్న్ గిఫ్ట్ వెనుక.. రెండు వ్యూహాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకటి నరసాపు రంలో తను పోటీ చేయకపోయినా.. బీజేపీ తరఫున బరిలో ఉన్న నాయకుడిని గెలిపించడం ద్వారా.. జగన్ ఇక్కడ నిలబెట్టిన మహిళా అభ్యర్థి ని ఓడించి.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం. దీనికి ఎన్నికల సమయంలోనే ఆయన పక్కా వ్యూహంతో నరసాపురంలో పర్యటించి.. తన వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా తిప్పారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి తనకు సన్నిహితుడని గెలిపించాలని కోరారు. దీంతో ఇక్కడ వైసీపీ ఓటమికి రఘురామ బాటలు పరిచారు.
ఇక, రెండోది.. ఉండిలో తాను గెలిచి.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. తద్వారా.. రాజకీయంగా తనను అంతం చేయాలని.. రాజకీయంగా మార్గాలు మూసుకుపోయేలా చేయాలని భావించిన జగన్‌కు చెక్ పెట్టడం. అంతేకాదు.. అసెంబ్లీలోనే జగన్‌ను టార్గెట్ చేసుకుని ముప్పుతిప్పలు పెట్టాలన్నది రఘురామ మరోవ్యూహంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే ఆయన రిటర్న్ గిఫ్ట్ అనే వ్యాఖ్యలు చేసి ఉంటారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates