కూట‌మికే జైకొట్టిన ఉత్త‌రాంధ్ర‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఉత్త‌రాంధ్ర‌ది కీల‌క పాత్ర‌. ఈ ప్రాంతంలో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డంలో ఇవి కీల‌క‌మ‌నే చెప్పాలి. అందుకే ఉత్త‌రాంధ్ర‌లో అత్య‌ధిక స్థానాలు గెలిచే పార్టీ రాష్ట్రంలో గ‌ద్దెనెక్కుతుంద‌నే అభిప్రాయాలున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర ఓట‌ర్లు కూట‌మికే జైకొట్టార‌నే అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక్క‌డ శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం ఉమ్మ‌డి జిల్లాల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి విజ‌య‌దుందుభి మోగించ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

ఉత్త‌రాంధ్ర అంటే టీడీపీకి కంచుకోట‌లాంటింది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్క‌డ టీడీపీకి ప‌ట్టున్న స్థానాలున్నాయి. కానీ గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గాలికి ఫ‌లితాలు తారుమార‌య్యాయి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాలు మాత్ర‌మే గెలిచింది. కానీ ఈ సారి మాత్రం ఆ సంఖ్య కచ్చితంగా పెరిగే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన ఓట‌ర్లు కూట‌మి వైపు మొగ్గుచూపార‌నే చెప్పాలి. విజ‌యన‌గ‌రంలో 2019లో టీడీపీకి భంగ‌పాటు ఎదురైంది. ఇక్క‌డ వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీకి షాక్ త‌ప్ప‌ద‌నే విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. టీడీపీ ప్ర‌భంజ‌నం మ‌రోసారి పున‌రావృత‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

ఇక విశాఖ‌ప‌ట్నం చూసుకుంటే అక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నాలుగు స్థానాల‌కే ప‌రిమితమైంది. కానీ ఈ సారి మాత్రం లెక్క మారుస్తామంటూ కూట‌మి నేత‌లు ధీమాగా చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈవీఎంల‌లో న‌మోదైన ఓట్ల‌తో ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ మ‌రోసారి జ‌య‌కేత‌నం ఎగుర‌వేయ‌బోతుంద‌ని ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం, సంక్షేమ ప‌థ‌కాలే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని వైసీపీ ఆశిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే వైసీపీ ఆశ‌లు కూలేందుకు ఎంతో స‌మ‌యం లేద‌నే టాక్ వినిపిస్తోంది.