వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు, సమావేశాలు పెడుతూ రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ, రైతులను మోసం చేసిందంటూ హరీష్ రావు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ బోనస్ కేవలం సన్నపు వడ్లకే ఇస్తామంటారా? అని హరీష్ ప్రశ్నిస్తున్నారు. ఇలా బావబావమరుదులు ప్రజాక్షేత్రంలో యాక్టివ్‌గా ఉన్నారు. కానీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది.
అసెంబ్లీ ఎన్నికల పరాభవం తర్వాత, తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ కాస్త విరామం తీసుకున్నారు. తిరిగి లోక్‌సభ ఎన్నికలకు ముందు రంగంలోకి దిగారు. పంటలు ఎండిపోతున్నాయంటూ పొలం బాట పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేశారు. కానీ కేసీఆర్ ఎంత చేసినా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లాభం కలగలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదన్నది విశ్లేషకుల మాట. దీంతో పోలింగ్ ముగియగానే కేసీఆర్ యథావిధిగా ఫాంహౌజ్‌కు వెళ్లిపోయి రెస్టు తీసుకుంటున్నారు.
ఈ సమయంలో ఇటు తనయుడు, అటు అల్లుడు అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సిటింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడూ విమర్శలు చేస్తూ పార్టీ ఉనికిని కాపాడేందుకు హరీష్ కష్టపడుతున్నారు. దీంతో కేసీఆర్ బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి కేసీఆర్ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.