రజినీ కాంత్.. నాన్న-పులి

సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం గురించి చర్చ రెండు దశాబ్దాల కిందట మొదలైంది. 90ల్లోనే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ విషయంలో ఎప్పుడూ స్పష్టత ఇవ్వలేదు. వస్తానని చెప్పడు, రాననీ తేల్చడు. రాజకీయాల్లోకి రావాలని రజినీకి లోపల ఉన్నప్పటికీ.. జయలలిత, కరుణానిధి లాంటి రాజకీయ దిగ్గజాల్ని ఢీకొట్టేందుకు ధైర్యం చాలకే ఆయన ఆగిపోయారని సన్నిహితులు అంటారు.

చివరికి జయలలిత మరణించి, కరుణానిధి మంచానికి పరిమితమైన స్థితిలో కానీ ఆయనకు ధైర్యం రాలేదు. పోనీ అప్పుడైనా వెంటనే రంగంలోకి దిగాడా.. దూకుడు ప్రదర్శించాడా అంటే అదీ లేదు. జయలలిత మరణించి నాలుగేళ్లు కావస్తున్నా.. కరుణానిధి చనిపోయి రెండేళ్లు దాటుతున్నా.. ఇంకా రజనీ రాజకీయ పార్టీని మొదలుపెట్టలేదు.

రజినీ రాజకీయ పార్టీకి రంగం సిద్ధం.. అంటూ మీడియా ఇప్పటిదాకా ఎన్నిసార్లు వార్తలొచ్చాయో లెక్కలేదు. అంతా ఓకే.. ఇక పార్టీని మొదలుపెట్టడమే తరువాయి అని ఒక వార్త రావడం.. తర్వాత దాని ఊసే లేకుండా పోవడం.. ఇదీ వరస. రాజకీయాల్లోకి వస్తున్నా అని అధికారికంగా చెప్పడానికి కూడా చాలా సమయం తీసుకున్న రజినీ.. పార్టీని మొదలుపెట్టే విషయం మాత్రం నాన్చుతూనే ఉన్నాడు.

గత ఏడాది లోక్‌సభ ఎన్నికల జోలికే వెళ్లలేదు ఆయన. తన టార్గెట్ అసెంబ్లీ ఎన్నికలన్నట్లు చెప్పుకున్నాడు కానీ.. వాటి కోసం అయినా ఏడాది ముందు నుంచే పని మొదలు పెట్టాలని ఆయనకు అనిపించలేదు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలే సమయం ఉండగా.. మళ్లీ ఇప్పుడు ‘రజినీ రాజకీయ పార్టీకి రంగం సిద్ధం’ అంటూ మీడియాకు మళ్లీ లీకులిచ్చారు.

ఐతే ఈ వ్యవహారం ‘ఆవు-పులి’ కథలా తయారైంది. గతంలో చాలాసార్లు ఈ విషయంలో ఆశించి ఫూల్స్ అయిన అభిమానులు సైతం తాజా అప్ డేట్‌ను లైట్ తీసుకుంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో కామెడీ కూడా చేస్తున్నారు. చేతిలో ఇంకా ‘అన్నాత్తె’ అనే సినిమా పెట్టుకున్న రజినీ.. కరోనా భయం మధ్య దాన్నెప్పుడు పూర్తి చేస్తాడో, ఇంకెప్పుడు పార్టీని మొదలుపెట్టి క్షేత్ర స్థాయిలోకి దిగి ఎన్నికల దిశగా నడిపిస్తాడో చూడాలి మరి.