ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాటలే కాదు.. ఆశలు కూడా కోటలు దాటుతున్నాయి. ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో ప్రజలు ఎవరికి ఓటేశారో తెలియక.. మేధావులు సైతం జట్టుపీక్కుంటున్న పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఓటరు నాడిని పట్టుకునే ప్రయత్నం చేసి కూడా.. చాలా సర్వేలు ఏమీ తేల్చలేక తలలు పట్టుకుంటున్నాయి. ఇక, పోటెత్తిన ఓటరు దెబ్బకు ఈవీఎంలలో ఎన్నడూలేనన్ని రికార్డు స్థాయిలో ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా.. ఓటరు నాడి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కానీ, వైసీపీలో కీలక నాయకులు మాత్రం తమదే గెలుపని డబ్బా కొట్టుకుంటున్నారు.
సీఎం జగన్ బ్రిటన్‌కు వెళ్తూ.. ముందు రోజు విజయవాడలో ఐప్యాక్‌తో మాట్లాడినప్పుడు తమకు 151 సీట్లు తగ్గవని చెప్పారు. తమదే విజయమని చెప్పుకొన్నారు. మరి దీనికి ఈక్వేషన్ ఏంటో ఆయన చెప్పలేదు. ఇక, ఆ తర్వాత.. మంత్రి బొత్స సత్యనా రాయణ మరో అడుగు ముందుకు వేశారు. ఏపీలో మరోసారి తమ ప్రభుత్వమే వస్తుందని విశాఖలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జూన్ 4న ఎన్నికల ఫలితం వస్తుండగా.. 9వ తేదీన సీఎంగా రెండో సారిజగనే ప్రమాణం చేస్తారని చెప్పారు. అంతేకాదు.. విశాఖే వేదికని కూడా బొత్స చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తర్వాత కూడా ఆయన వెల్లడించడం గమనార్హం.
ఇక, తాజాగా రాజ్యసభ సభ్యుడు, ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఏకంగా ముహూర్తంతో పాటు.. సమయం కూడా చెప్పుకొచ్చారు. తమ పార్టీకి 151 సీట్లు తగ్గవని ఈయన కూడా నొక్కి వక్కాణించారు. ఎట్టి పరిస్థితిలోనూ తమదే విజయమని చెప్పారు. జూన్ 4న ఫలితం వస్తుందని.. అదే నెల 9వ తేదీన సీఎంగా రెండో సారి జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. అంతేకాదు.. ఆ రోజు ఉదయం 9.38 గంటలకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకొచ్చారు.
ఎన్నికల్లో అనుకూల ఓటు వల్లే.. పోలింగ్ శాతం పెరిగిందని వైవీ జోస్యం చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరి జోస్యాలు చూస్తే.. ఔనా.. నిజమా! అని నోరెళ్లబెడుతున్నారు ప్రజలు. వాస్తవ ఫలితం రావడానికి ఇంకా 14 రోజుల సమయం ఉంది. దీంతో ఇతర పార్టీల నాయకులు మౌనంగా ఉంటే.. వైసీపీ మాత్రం తమదే గెలుపని వ్యాఖ్యానించడం.. ముహూర్తాలు.. తారీఖులు, సమయాలు నిర్ణయించడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఇవి ఏమేరకు నిజమవుతాయో చూడాలి.