ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస.. అనంతర పరిణామాలపై ఏకంగా 100మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా 300 మందిపై ఎఫ్ ఐఆర్‌లు నమోదు చేశారు.ఇంకా, వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా వుంటే..ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. వీటిని విచారించేందు కు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా నియమించారు.
పోలీసు డైరెక్టర్ జనరల్.. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. శనివారం రాత్రి నుంచి జరుగుతున్న ఈ విచరణలకు సంబంధించిన ప్రాథమిక అంశాలతో ఒక నివేదికను సిద్ధం చేశాయి. పల్నాడులోని మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఈ బృందాలు పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వివరాలు సేకరించాయి.
మరోవైపు.. సస్పెండ్ అయిన.. ఎస్పీలు, సీఐల నుంచి కూడా వివరణ తీసుకుంటున్నారు. ఇప్పటికే వంద మందిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయా వివరాలను కూడా పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సిట్ బృందాలు డీజీ వినీత్ బ్రిజ్ లాల్ కు అందించనున్నారు. అనంతరం ఆయా నివేదికలను వినీత్ బ్రిజ్ లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. అదే సమయంలో అల్లర్లపై విచరణకు మరింత సమయం ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు.
అయితే.. ఇది మరో రాజకీయ వివాదానికి దారితీస్తోంది. వైసీపీ అనుకూల అధికారులనే సిట్‌లో నియమిం చారని.. దీంతో సిట్ నివేదికలు కూడా ఏకపక్షంగా ఉండే అవకాశం ఉందని టీడీపీ నాయకులువిమర్శలు గుప్పిస్తున్నారు. ‘పెద్దతలకాయలపై’ చర్యలు తీసుకోకుండా.. కేవలం నివేదికలతో సరిపెడుతున్నారని అంటున్నారు. అసలు నియామకాలే తప్పుగా జరిగాయని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి.