చంద్రబాబే కాబోయే సీఎం అంటోన్న పీకే

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని సీఎం జగన్ బల్లగుద్ది మరీ చెప్పి లండన్ వెళ్లిపోయారు. కానీ, ఐ ప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని, ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని పోలింగ్ కు ముందే పీకే పదే పదే చెప్పారు.

ఇక, వైసీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి సీఎం జగన్ విశాఖలో ఈ నెల 9న రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వైసీపీ ఎక్స్ ఖాతాలో అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో టీడీపీ కూటమిదే విజయమని పీకే మరోసారి జోస్యం చెప్పారు. జర్నలిస్ట్ బర్ఖాదత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమని పీకే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ మాదిరే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

లెక్కింపు రోజు 4 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ముందు రౌండ్లలో తమకు మెజార్టీ వస్తుందని చెప్పే నేతలను చూశానని, ఓటమిని అంగీకరించేవారిని చూడలేదని చెప్పారు. చంద్రబాబు గెలుస్తారని చెబితే.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ అంటున్నారని, ఈ చర్చకు అంతం ఉండదని అన్నారు. బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని, బీజేపీ, మోదీలపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా ఆగ్రహం లేదని చెప్పారు. బీజేపీకి 2019లో వచ్చినన్ని సీట్లు వస్తాయని, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.