తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక రిజల్ట్ రావడమే మిగిలింది. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలందరూ రిలాక్స్‌డ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రం టెన్షన్ తప్పడం లేదు. ఆయన ఇప్పుడు టఫ్ టెస్టును ఎదుర్కుంటున్నారు. అవును.. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే టాస్క్ ఆయనదే. ఈ భారాన్ని కేటీఆర్ భుజాలపై మోపి పార్టీ అధినేత కేసీఆర్ రెస్టు తీసుకుంటున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అది కూడా ఉప ఎన్నిక. పైగా ఆ సిటింగ్ స్థానం కూడా బీఆర్ఎస్‌దే. దీంతో కేటీఆర్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అనుకోవడానికి లేదు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టిన దెబ్బతో బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో పవనాలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను గెలిపించుకోవడం కేటీఆర్‌కు విషమ పరీక్షగా మారింది. ఇప్పటికే అక్కడి నాయకులతో, పట్టభద్రులతో కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తూ తమ అభ్యర్థి విజయం కోసం శ్రమిస్తున్నారు.
కానీ ఇక్కడ బీఆర్ఎస్‌కు విజయం దక్కడం అంత తేలిక కాదు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఉంది. ముఖ్యంగా 2021లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తీన్మార్ మల్లన్న ఈ సారి కచ్చితంగా గెలవాలనే కసితో ఉన్నారు. మరోవైపు నిరుద్యోగులు, యువత నుంచి ఇప్పటికీ బీఆర్ఎస్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోందనే అభిప్రాయాలున్నాయి. పైగా అక్కడి బీఆర్ఎస్ నాయకుల్లోనూ అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ ఉనికికి మరింత డ్యామేజీ కలగనుంది. అలాగే కేటీఆర్ నాయకత్వ సామర్థ్యంపైనా ప్రశ్నలు మరింత పదునెక్కుతాయి. మరి ఈ పరీక్షలో కేటీఆర్ పాసవుతారేమో చూడాలి.