కుప్పం బాబుకు లక్ష ‘కప్పం’ చెల్లిస్తుందా ?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడుకు పెట్టని కోట. 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ టీడీపీ తప్ప మరో పార్టీ గెలవలేదు. 1989 నుండి వరసగా ఇప్పటి వరకు చంద్రబాబు ఏడు సార్లు గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఇక్కడ చంద్రబాబుకు లక్ష మెజారిటీ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పోరాడింది. మరి అది సాధ్యం అవుతుందా ? కాదా ? అన్న విషయంలో భారీగా బెట్టింగులు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం.

ఈసారి లక్ష మెజారిటీ గ్యారంటీ అని టీడీపీ చెబుతుంటే ఈసారి ఓడిస్తాం అంటూ వైసీపీ చెబుతుంది. ఎన్నడూ నామినేషన్ వేయడానికి రాని చంద్రబాబు ఈసారి తన కుటుంబ సభ్యుల చేత నామినేషన్ వేయించారు. టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పాత నాయకత్వాన్ని పక్కన పెట్టి కొత్త నాయకత్వానికి టీడీపీ బాధ్యతలు అప్పగించింది. దీంతో పాత, కొత్తల మధ్య గ్యాప్ వచ్చినట్లు చెబుతున్నారు.

వైౌసీపీ తరపున బీసీ క్షత్రియ సామాజికవర్గానికి చెందిన భరత్‎ను తెర మీదకు తీసుకువచ్చారు. భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని ప్రచారంలో జగన్ ప్రకటించారు. ఇది తమకు మేలు చేకూరుస్తుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఎన్నికలకు ముందే హాంద్రీ నీవా నీళ్లు కుప్పం తీసుకురావడం,పాలారు ప్రాజెక్టు పూర్తికి హామీ ఇవ్వడం తమను గెలుపు బాటలోకి తీసుకెళ్తాయని వైసీపీ భావిస్తుంది. మంత్రి పెద్దరెడ్డి పుంగనూరు కంటే ఎక్కువ ఫోకస్ కుప్పం మీదనే పెట్టడం గమనార్హం.

1989 నుండి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా కుప్పంలో దాదాపు 90 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. కుప్పంలో 2,25,775 మంది ఓటర్లు ఉండగా 89.88 శాతం మంది అంటే 2,02,920 మంది ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరునెలలలో మూడు సార్లు నియోజకవర్గంలో పర్యటించారు.

చంద్రబాబు గత ఎన్నికలలో 30,722 ఓట్లతో విజయం సాధించారు. 2014లో 47,121, 2009లో 46,066, 2004లో 59,588, 1999లో 65,687, 1994లో 56,588, 1989లో 6918 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999లో 65,687 ఓట్లే ఇప్పటి వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు సాధించిన అత్యధిక మెజారిటీ. మరి ఈ ఎన్నికలలో లక్ష మెజారిటీ ఖాయం అని టీడీపీ చెబుతుండగా, తామే గెలుస్తామని వైసీపీ చెబుతుంది. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో వేచిచూడాలి.