ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష, వర్షలతో కలిసి ఆయన లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్‌కు బయలు దేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న విమానం లండన్‌కు చేరుకుంది. అక్కడే జగన్ కుటుంబం ప్రయాణించిన విమానం తాలూకు ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. వాస్తవానికి విజయవాడలోనే దీనిని ఫొటోలు తీయాలని మీడియా ప్రయత్నించింది.
కానీ, విజయవాడ విమానాశ్రయంలోకి ఎవరినీ అనుమతించలేదు. దీంతో విజయవాడలో ప్రవేటు విమానాన్ని వినియోగిస్తున్నారని మాత్రమే తెలిసినా.. ఆ విమానం ఏంటనేది మాత్రం ఎవరికీ తెలియదు. లండన్‌లో సీఎం జగన్ కుటుంబం ప్రయాణించిన విమానం రన్ వేపై ఆగిన తర్వాత.. ఎవరో దీనిని క్యాప్చర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆలివ్ కలర్ రంగు, రెడ్ టేప్‌తో ఉన్న ఈ విమానం నుంచి సీఎం జగన్ కిందికి దిగుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. ఇక, మందీ మార్బలం వంటివి పెద్దగా ఎవరూ లేకపోవడం గమనార్హం.
అదేసమయంలో జగన్ తన చేతిలో రెడ్ కలర్లో ఉన్న ఒక స్వెటర్ ని తీసుకుని విమానం నుంచి కింది దిగిన దృశ్యం కనిపించింది. ఆయన విమానం దిగిన సమయంలో ఏపీ నుంచి ముందుగానే బ్రిటన్‌కు వెళ్లిన అధికారులు ప్రత్యేక కారును ఏర్పాటు చేసి.. వారే ఆయనకు స్వాగతం పలికారు. జగన్ వెనకాల ఆయన సతీమణి, పిల్లలు.. విమానం దిగారు. జగన్ ను చూసేందుకు లండన్‌లోని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, ఎన్నారై విభాగం నాయకులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి రావడం గమనార్హం. కొందరైతే.. దారి పొడవునా క్యూ కట్టి మరీ జగన్ ను చూసేందుకు వేచి ఉన్నారు.
కాగా, లండన్‌లోనే నాలుగు రోజులు గడప నున్న ఈ కుటుంబం.. తర్వాత స్విట్జర్లాండ్ వెళ్లనుంది. తర్వాత ఫ్రాన్స్‌లో పర్యటించి.. ఈ నెల ఆఖరుకు ఏపీకి చేరుకోనుంది. జగన్ కుటుంబం లండన్‌లో దిగిన విమానం తాలూకు వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates