బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై తర్జన భర్జనలు ఉన్నా..ఎవరికి వారు అంచనాలు వేసుకున్నా.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. 92 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉందనే లెక్కలు అందుతున్నాయి. ప్రాంతాల వారీగా చూసినా.. అభ్యర్థుల పరంగా అంచనా వేసినా.. ఈ లెక్క ఖచ్చితమనే తెలుస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
వీటిలో కీలకమైన ఉండి, మంగళగిరి, టెక్కలి, పలాస, కుప్పం, ఎచ్చెర్ల, విజయవాడ సెంట్రల్, తూర్పు, విశాఖ తూర్పు, దక్షిణం సహా 92 నియోజకవర్గాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కంటే కూడా ఇక్కడ ఎక్కువగా పోలింగ్ జరిగిన నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. అయితే.. ఎంతలేదన్నా.. తమకు 92 స్థానాల్లో పక్కా విజయం ఖాయమని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో ఉన్న నాయకుల పనితీరును కూడా అంచనా వేసుకుంటున్నారు.
అంటే కేవలం టీడీపీ ఒక్కటే 92 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ సారి పుంగనూరు కూడా గెలిచే అవకాశం ఉండడం గమనార్హం. అదేవిధంగా కుప్పంతోపాటు.. చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇక, మరో అంశం.. పార్టీలో సమన్వయం టికెట్ల విషయంలో కొంత రగడ జరిగినా.. పెనమలూరు, నూజివీడు, గుడివాడ వంటి కీలక స్థానాలపై ముందు నుంచి కూడా.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
చివరి నిముషంలో చంద్రబాబు.. తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లోనూ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని , అధికారంలోకి రావడం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates