ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు ఈ నెల 14న సీబీఐ కోర్టు అనుమతించింది. నిన్న లండన్ బయలుదేరిన జగన్ తిరిగి జూన్ 1న రాష్ట్రానికి తిరిగి వస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 అనే విలాసవంతమైన విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు రూ.12 లక్షలుగా చెబుతున్నారు. ఒకరోజు ముందుగానే గన్నవరం విమానాశ్రయానికి ఆ విమానం చేరుకున్నది.
శుక్రవారం రాత్రి తన కుటుంబంతో రాత్రి 11 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా లండన్ బయలుదేరారు. జగన్ భద్రత కోసం ఇప్పటికే నలుగురు అధికారులు లండన్ వెళ్లినట్లు సమాచారం. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతర ఖర్చులు కలిపి రూ.కోటిన్నర అవుతున్నట్లు తెలుస్తుంది. జగన్ వ్యక్తిగత పర్యటన కావడంతో విమాన ఖర్చులు, కుటుంబ ఖర్చులు ఆయన సొంతంగా భరించినా భద్రతా సిబ్బంది ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నదని తెలుస్తుంది.