“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు“- అని వైసీపీ రెబల్ ఎంపీ, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆయన మంగళ వారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి విజయం కాదు.. క్లీన్ స్వీప్ ఖరారైందని చెప్పారు. జూన్ 4వ తేదీన కూటమి విజయ సంబరాలతో పాటు.. వైసీపీ దినకార్యం కూడా జరుగుతుందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు నిరంకుశ ప్రభుత్వంపై దండెత్తారని.. దీనిని తెలుసుకుంటే మంచిదని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
వైసీపీ పతనం ఎన్నికల షెడ్యూల్‌తో ప్రారంభమై.. పోలింగ్ తో ముగిసిందని.. ఇక, అదిచచ్చిపోయిందని.. జూన్ 4న పెద్ద కర్మ మాత్రమే మిగిలి ఉందని రఘురామ అన్నారు. తన పుట్టిన రోజు నాడే వైసీపీ చచ్చిపోవడం, పతనం కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.
“జూన్ 4న జరగనున్న వైసీపీ పెద్దకర్మలో అందరూ పాల్గొందాం” అని రఘురామ పిలుపునిచ్చారు. జూన్ 4 తర్వాత.. వైసీపీ అంటే.. ఒక చరిత్రలో కలిసిపోయిన.. దుష్టపరిపాలనకు నియంతల పరిపాలనకు చిహ్నంగా మారుతుందన్నారు.
ఉద్యోగులు రాష్ట్రంలో 4 లక్షల పైచిలుకు ఓట్లు వేశారని.. ఇవన్నీ కూటమికి అనుకూలంగా వేసినవేనని చెప్పారు. పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి కూడా.. కూటమిని గెలిపించేందుకు అందరూ కృషి చేశారని.. వారిలో కసి కనిపించిందని రఘురామ అన్నారు.
మహిళలు కూడా.. కూటమికి అనుకూలంగా వేశారని చెప్పారు. సూపర్ సిక్స్ మంత్రం బాగా కలిసి వచ్చిందన్నారు. ఉండిలో తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని ఆయన చెప్పారు. కేవలం ఫలితాల ప్రకటన , చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలి ఉందని అన్నారు.