జైలుకు వెళ్ల‌కుండా మీరే న‌న్ను కాపాడాలి:  కేజ్రీవాల్‌

కీల‌క‌మైన నాలుగోద‌శ ఎన్నికల పోలింగ్ స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవా ల్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. “పోలింగ్ స‌మ‌యంలో ప్ర‌చారం చేసుకునేందుకు నేను జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను. ఎన్నికల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌..జూన్ 1న నేను మ‌ళ్లీజైలుకు వెళ్లాలి. నేను జైలుకు వెళ్ల‌కుండా ఉండాలంటే.. మీరే న‌న్ను కాపాడాలి“ అని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఐదో ద‌శ‌లో ఢిల్లీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ ఏడు పార్ల‌మెంటు స్థానాల‌కు గాను.. మూడు చోట్ల ఆప్ అభ్య‌ర్థులు.. మ‌రో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్(కూట‌మి) అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోనూ అదే ద‌శ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కేజ్రీవాల్ ఓట‌ర్ల‌కు పిలుపునిచ్చారు. చీపురు గుర్తుపై ఓటేసి.. ఆప్‌కు అఖండ మెజారిటీ ఇవ్వాల‌ని.. ఇదే జ‌రిగితే.. తాను ఇక‌, జైలుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుండ‌డంతో ఢిల్లీలో బీజేపీ జాడ లేకుండా పోయింద‌న్నారు.

అందుకే త‌న‌పై త‌ప్పుడు కేసులు పెట్టి.. న‌న్ను నా పార్టీని లేకుండా చేయాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంద న్నారు. ఇప్పుడు బీజేపీ వ్యూహాన్ని తిప్పికొట్టే అవ‌కాశం ప్ర‌జ‌ల‌కు వ‌చ్చింద‌న్నారు. చీపురుకు ఓటేస్తే.. ఆప్ బ‌ల‌ప‌డుతుంద‌ని.. త‌ద్వారా.. బీజేపీ నేత‌లు తోక‌ముడుస్తార‌ని చెప్పారు. దీంతో తాను జైలుకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు. తాను జైలుకు వెళితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు అన్నీ మ‌ధ్య‌లోనే ఆగిపోతాయ‌ని చెప్పారు.