నాయకుడు అంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి. అందునా ప్రజాప్రతినిధి అంటే మరింత బాధ్యతతో వ్యవహరించాలి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన తాను అందరికీ అతీతం అనుకుంటే తెనాలి ఎమ్మెల్యేకు జరిగిన పరాభవమే ఎదురవుతుంది.
ఓటు వేయడానికి వెళ్లిన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అక్కడ లైన్లో నిలబడిన ఓటర్లను పట్టించుకోకుండా నేరుగా లోపలికి వెళ్తుండగా అక్కడ ఉన్న ఓటరు అభ్యంతరం చెప్పాడు.
ఇంత మంది క్యూలో నిల్చుంటే నేరుగా ఎలా లోపలికి వెళ్తావని ప్రశ్నించాడు. దీంతో నన్నే ఆపుతావా అంటూ ఎమ్మెల్యే ఓటరు చెంప మీద కొట్టాడు. హఠాత్పరిణామం నుండి తేరుకున్న ఓటరు అంతే వేగంతో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించాడు.
ఇది చూసిన అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటర్ పై మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే, అతని అనుచరుల దౌర్జన్యంపై సామాన్య ఓటర్లు మండిపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates