రాష్ట్రంలో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచే ఆయా నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ బూతుల్లోనూ పెద్ద ఎత్తున ఓట్లర్లు బారులు తీరారు. కొన్ని కొన్ని బూతుల్లో అయితే.. రెండేసి వరుసల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఆసక్తిగా మారింది.
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచివంగా గీత పోటీలో ఉన్నారు. ఇద్దరూ కూడా భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నారు. చిత్రంగా ఇక్కడ ఉదయం 6 గంటలకే రెండే లైన్ల చొప్పున ఓటర్లు బారులు తీరారు.
కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి యువ నేత భరత్ పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోని బూతుల్లో ఉదయం 5 గంటలకే ఓటర్లు వచ్చి బూతుల ముందు కూర్చున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా ఆరు గంటలకే ఓటర్లు పోటెత్తారు.
మంగళగిరి: ఇక్కడ నుంచి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ రెండో సారి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి తొలిసారి మురుగుడు లావణ్య బరిలోకి దిగారు. ఇక్కడ అయితే.. గతానికి భిన్నంగా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారు.
హిందూపురం: నందమూరి బాలయ్య వరుసగా మూడోసారి ఇక్కడ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి మహిళా నాయకురాలు బరిలో ఉన్నారు. ఇక్క డకూడా ఓటర్లు ఉదయాన్నే క్యూ కట్టారు.
అనకాపల్లి: ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నేత సీఎం రమేష్ బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ఉదయాన్నే ఓటర్లు తరలివచ్చారు.
పులివెందుల: సీఎం జగన్ వైసీపీ నుంచి, బీటెక్ రవి టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్క డకూడా ఉదయాన్నే ఓటర్లు పోటెత్తారు. ఇక్కడ గతంలో ఈ రేంజ్‌లో ఓటర్లు ఉదయాన్నే రాలేదు. దీంతో కీలక నియోజకవర్గాల్లో పోలింగ్ బూతులు కిక్కిరిసిపోతున్నట్టయింది. మరి ఇది దేనికి సంకేతం అనే విషయంపై టీడీపీ, వైసీపీలు తమ తమ రీతిలో విశ్లేషణలు చేస్తున్నాయి.