క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది. ఉద‌యం 5-6 మ‌ధ్యే పోలింగ్ బూతుల ముందు ఓట‌ర్లు బారులు తీరారు. నిర్దేశిత స‌మ‌యం ప్ర‌కారం ఉద‌యం 7 గంట‌ల‌కు.. పోలింగ్ ప్రారంభ‌మైంది. కొన్ని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మిగిలిన చోట ఇబ్బందులు లేకుండానే ప్ర‌క్రియ సాగిపోయింది.

అయితే.. చిత్రంగా గ‌త 2019 ఎన్నిక‌ల స‌మయంలో ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యానికి అంటే.. పోలింగ్ ప్రారంభ‌మైన రెండుగంట‌ల వ్య‌వ‌ధిలో 5-6 శాతం మాత్ర‌మే న‌మోదైన ఓట్లు.. తాజా ఎన్నిక‌ల్లో దాదాపు 10 శాతానికి రీచ్ అయ్యాయి. అల్లూరి సీతారామ‌రాజు మ‌న్యం వంటి మారు మూల జిల్లాల్లో కూడా.. ఉద‌యం 9 గంట‌ల‌కు 6.77 శాతంన‌మోదైంది. ఇక‌, బాప‌ట్ల‌లో 11.36 శాతం, చిత్తూరులో 11.84 శాతం పోలింగ్ న‌మోదైం ది. గుంటూరులో య‌ధావిధిగా ఘ‌ర్ష‌ణ‌లు, గొడ‌వ‌ల‌తో పోలింగ్‌కు ఆహ్వానం ప‌లికిన విష‌యం తెలిసిందే. దీంతో ఇక్క‌డ అత్యంత త‌క్కువ‌గా 6.17 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది.

అయితే.. ఇక్క‌డ చెప్పుకోవాల్సింది.. సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇక్క‌డ రాష్ట్రంలోనే అత్య‌ధికంగా.. తొలి రెండు గంట‌ల్లో 12.09 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇది ఎవ‌ర్ రికార్డ్‌గా అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డ వైఎస్ కుటుంబానికి చెందిన ఆడ‌ప‌డుచులు వైఎస్ ష‌ర్మిల‌, వివేకా కుమార్తె సునీత‌లు భారీ ఎత్తున ప్ర‌చారం చేయ‌డం , కొంగు చాపి అడుగుతున్నా.. అంటూ ష‌ర్మిల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే.

కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ రికార్డు స్థాయిలో ఓట్లు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి సాయంత్రం వ‌ర‌కు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో 99 శాతం వ‌ర‌కు పోలింగ్ న‌మోదైనా ఆశ్చ‌ర్యం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 82 శాతం ఇక్క‌డ ఓట్లు పోల‌య్యాయి.