ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్ పాత్ర కూడా కీలకమే. ఆయన వ్యూహాలను అనుసరించే ఎన్నికల్లో పోటీ పడింది వైసీపీ. చంద్రబాబు ప్రభుత్వం మీద జనాల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచడంలో, వైసీపీ గ్రాఫ్ పెరగడంలో పీకే అండ్ టీం వేసిన ప్రణాళికలు బాగా పని చేశాయి.
ఐతే అప్పట్లో ఐప్యాక్ టీంకు ప్రశాంత్ కిశోరే సారథ్యం వహించేవారు. కానీ తర్వాత ఆ సంస్థకు ప్రశాంత్ దూరమయ్యారు. ఇప్పుడు ఆయనకు ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో జగన్ ఓడిపోతున్నాడనే అంచనా వేశారు పీకే. దీంతో వైసీపీ ఆయన్ని ఎటాక్ చేసింది కూడా. తాజాగా ఒక టీవీ ఛానెల్ ఏపీ రాజకీయాలపై ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.
ఈ సందర్భంగా జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పీకే. జగన్‌తో తనకు శతృత్వం ఏమీ లేదని.. ఆయన ఇప్పటికీ తనకు మంచి మిత్రుడే అని పీకే అన్నాడు. ఢిల్లీలో ఏడాదిన్నర కిందట జగన్‌ను కలిశానని.. ఆ సందర్భంగా తాను రెండోసారి విజయం సాధించడమై చాలా ధీమాగా కనిపించారని.. తనకు పోటీయే లేదని వ్యాఖ్యానించారని పీకే చెప్పాడు. ఆ సమయంలో తన పార్టీకి 155 సీట్లు రాబోతున్నట్లుగా తనతో చెప్పినట్లు వెల్లడించాడు.
ఐతే తన అంచనా ప్రకారం వైసీపీ 151 సీట్ల నుంచి 51 సీట్లకు పడిపోనుందని పీకే వ్యాఖ్యానించాడు. 2019లో జగన్ ఎలా మొదలుపెట్టాడో ఆ స్థితికి ఇప్పుడు రాబోతున్నట్లు పీకే చెప్పాడు. కేవలం జనాలకు పథకాల డబ్బులు మాత్రమే ఇస్తే సరిపోదని.. పాలన, అభివృద్ధి కూడా ఉండాలని, అది లేకే జగన్ ఓడిపోతున్నాడని పీకే విశ్లేషించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates