మంత్రిగారికి ప‌దవీ గండం… వైసీపీలో హాట్ టాపిక్‌!

ఔను.. వైసీపీలో ఈ టాపిక్‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది. రాష్ట్రంలో గ‌త ప‌దిహేను రోజులుగా సాగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌వుతున్న దూకుడు.. వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. ఆయా ప‌రిణామాల‌ను అరిక‌ట్ట‌డంలోను, ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన కౌంట‌ర్ ఇవ్వ‌డంలోను పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా ఉంది. నిజానికి అంత‌ర్వేది ర‌థం ద‌గ్థం ఘ‌ట‌న‌లో 10 మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేశామ‌ని మంత్రి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఇత‌ర ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 50 మంది అధికారులను ఇంటి ముఖం ప‌ట్టించామ‌న్నారు.

ఓకే! త‌ప్పు చేశారు .. కాబ‌ట్టి స‌ద‌రు అధికారుల‌ను ఇంటికి పంపించారు. కానీ, మంత్రిగా ఏడాదిన్న‌ర నుంచి ఈ శాఖ‌ను చూస్తున్న వెలంప‌ల్లికి బాధ్యత లేదా? వ‌రుస ప‌రిణామాలు జ‌రుగుతుంటే.. ఆయ‌న‌కు మాత్రం సంజాయిషీ చెప్పుకొనే ధ‌ర్మం తెలీదా? అనేది వైసీపీ నేత‌ల నుంచి ఎదుర‌వుతున్న కీల‌క ప్ర‌శ్న‌. ఆదిలోనే ఇలాంటి విష‌యాలు వెలుగు చూసిన‌ప్పుడు ఆయ‌న క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం ప‌రిస్థితిని దారుణ స్థాయికి తీసుకువ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు సొంత నేత‌ల నుంచే వ‌స్తున్నాయి. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన అధికారుల స‌మీక్ష‌లో.. అవినీతి అత్యంత దార‌ణంగా ఉన్న రెవెన్యూ శాఖ స‌ర‌స‌న దేవ‌దాయ శాఖ చేరింద‌ని సాక్షాత్తూ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించి.. హెచ్చ‌రించినట్టు వార్త‌లు వ‌చ్చాయి.

ఎక్క‌డిక‌క్క‌డ అధికారుల‌ బ‌దిలీల్లో అవినీతి, కాంట్రాక్టుల్లో అవినీతి పెచ్చ‌రిల్లింద‌నేది వాస్త‌వం కాదా అన్న ప్ర‌తిప‌క్షాల‌పై ఎదురు దాడి చేస్తున్న మంత్రి.. వెలంప‌ల్లి.. స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం అంటే.. ఆయా విమ‌ర్శ‌ల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించిన‌ట్టేగా? అనే విశ్లేష‌ణలూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా.. దుర్గ‌గుడి విష‌యంలో.. మంత్రి వెలంప‌ల్లి చేసిన వ్యాఖ్య‌లు నిర్మాణాత్మ‌కంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మూడు సింహాలు కాదు.. రెండు సింహాలే.. ఒక వేళ లాక‌ర్‌లో పెట్టి ఉంటారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే జ‌రిగి ఉంటుంది.. వంటి అర్ధం లేని వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌ను మ‌రోసారి బోనులో నిల‌బెట్టేలా చేశాయి.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే ప‌రిస్థితి తీవ్ర‌త‌ను ఆయ‌న త‌క్కువగా అంచ‌నా వేసిన‌ట్టు ఉన్నార‌నే వ్యాఖ్య‌లు.. సొంత పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దేవాల‌యాల‌నే టార్గెట్ చేసుకుని జ‌రుగుతున్న వ‌రుస ప‌రిణామాల‌ను అరిక‌ట్ట‌డంలోను, అధికారులను స‌రైన దారిలో న‌డిపించ‌డంలోనూ వెలంప‌ల్లి విఫ‌ల‌మ‌య్యారా? అనే సందేహాలు కూడా వారి నుంచే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు ప‌ద‌వీ గండం పొంచి ఉంద‌ని.. జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నార‌ని.. వైసీపీ నాయ‌కులు త‌మ‌లో తామే చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో.. జ‌గ‌న్ ఏం చేస్తారో.. చూడాలి. ఏదేమైనా.. దేవ‌దాయ శాఖ మాత్రం ఇటీవ‌ల కాలంలో ఒకింత వ‌డిదుడుకులు ఎదుర్కొంటున్న విష‌యం వాస్త‌వం.