ఉద్య‌మ‌కారుల గుడ్‌బై.. ఏకాకిగా కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతూనే ఉంది. ముఖ్యంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌కు వ‌రుస షాక్‌లు త‌గులుతూనే ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఒక‌ట్రెండు సీట్లు గెలిచే అవ‌కాశాలూ లేవ‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో.. కేసీఆర్‌కు అన్ని ర‌కాలుగా స్ట్రోక్ ఇస్తోంది. తాజాగా తెలంగాణ మ‌లి ద‌శ ఉద్య‌మంలో ప్రాణాలు వ‌దిలిన శ్రీకాంత్ చారి త‌ల్లి శంక‌ర‌మ్మ బీఆర్ఎస్‌ను వ‌దిలి కాంగ్రెస్‌లో చేర‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం శ‌రీరానికి నిప్పు అంటించుకుని చ‌నిపోయిన శ్రీకాంత్ చారి త‌ల్లి ఇప్పుడు కేసీఆర్‌ను కాద‌న‌డం హాట్ టాపిక్ అయింది.

ఉద్య‌మ‌కారులు గుడ్‌బై చెబుతుండ‌టంతో ఏకాకిగా కేసీఆర్ మిగిలిపోతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఉద్య‌మకారుల‌ను ప‌ట్టించుకోని కేసీఆర్‌కు వాళ్ల ఉసురు త‌గులుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. 2014లో తెలంగాణ‌లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌ద్దెనెక్కాన‌నే అహంకారంతో ఉద్య‌మ‌కారుల‌ను కేసీఆర్ అవ‌మానించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్య‌మ ద్రోహుల‌ను పిలిచి మ‌రీ ప‌క్క‌న పెట్టుకున్నారు. దీంతో ప్రొఫెస‌ర్ కోదండ‌రాం లాంటి అస‌లైన ఉద్య‌మ కారులు కేసీఆర్‌కు దూర‌మ‌య్యారు.

రెండో సారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఉద్య‌మాల‌నే అణ‌గ‌దొక్కార‌నే విమ‌ర్శ‌లున్నాయి. దీంతో తెలంగాణ ఉద్య‌మ కారులు కేసీఆర్‌పైనే వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మితో భంగ‌ప‌డ్డ కేసీఆర్ ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోతున్నార‌నే చెప్పాలి. గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్‌పై శంక‌ర‌మ్మ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శ్రీకాంత్ చారి మ‌ర‌ణానికి విలువ ఇవ్వ‌ని కేసీఆర్‌.. ఉద్య‌మ ద్రోహుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ఆమెకు ఆగ్ర‌హాన్ని తెప్పించింది. భువ‌న‌గిరి ఎంపీ టికెట్ ఆశించినా కేసీఆర్ తిర‌స్క‌రించారు. గ‌తంలో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆమె తాజాగా కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ చేరాన‌ని చెప్పారు. శంక‌ర‌మ్మ‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశాలున్నాయి.