అంత డ‌బ్బు ఎలా వ‌చ్చింది?: ఈసీ ప్ర‌శ్న‌

ఏపీలోని జ‌గ‌న్‌ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సంచ‌ల‌న లేఖ రాసింది. ఒక్క‌సారిగా ప్ర‌భుత్వానికి ఇంత డ‌బ్బు ఎక్క‌డినుంచి వ‌చ్చింది? అని ప్ర‌శ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌లోగా స‌మాధానం చెప్పాల‌ని కూడా ఆదేశించింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు.. ల‌బ్ధి దారుల‌కు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివ‌రించాల‌ని కోరింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న విద్యాదీవెన‌.. రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్సిడీ, చేయూత‌, ఆస‌రా ప‌ధ‌కాలకు సంబంధించిన నిధుల పంప‌ణీ వ్య‌వ‌హారం.. ప్ర‌భుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మ‌ధ్య వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు ఈ నిధులు పంపిణీ చేయొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్ప‌టి నుంచో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ని.. కాబ‌ట్టి పంపిణీ చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది.

ఈ క్ర‌మంలో సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత‌.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న మ‌న‌సు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. పంపిణీ చేయొచ్చ‌ని తేల్చి చెప్పింది. అయితే.. ప్ర‌భుత్వ వాద‌న‌లు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్క‌రోజు వ‌ర‌కు స‌ర్కారుకు అనుమ‌తి ఇస్తూ.. తీర్పు వెలువ‌రించింది. దీంతో శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుంచి ప‌థ‌కాల ల‌బ్ధి దారుల‌కు 14 వేల కోట్ల రూపాయ‌ల పంపిణీ ప్రారంభ‌మైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్య‌క్తం చేసింది.

అయితే.. ఇంత‌లోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి మ‌రో లేఖ వ‌చ్చింది. జనవరిలో బ‌ట‌న్ నొక్కిన‌ పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వ‌లేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. స‌ర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్ర‌శ్నించింది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎలాంటి స‌మాధానం ఇస్తారో చూడాలి.