కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ‘మీ బిల్లు థౌజండ్. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అన్న డైలాగ్ తో ఆమె పాపులర్ అయిపోయారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏకంగా పోలీసులు ఆమెను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఆమెకు మద్దతుగా నిలవడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి ఆమె అక్కడే ఫుడ్ స్టాల్ నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చిందంటే క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రాకు చెందిన కుమారీ ఆంటీ ఈ నెల 13న ఎన్నికల నేపథ్యంలో తన స్వస్థలం గుడివాడలోని పెద్ద ఎరుకపాడుకు విచ్చేసి రాజకీయ ప్రచారం మొదలు పెట్టారు.
గుడివాడ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు ఆమె మద్దతు పలుకుతూ గుడివాడలోని పలు వార్డులలో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. “టీడీపీ అభ్యర్థి మహర్షి సినిమాలో మహేశ్ బాబు మాదిరిగా మంచి మనసున్న వ్యక్తి అని, ఆ సినిమాలో మహేశ్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడలో రాము సేవ చేస్తున్నాడని” ప్రశంసలు కురిపించింది కుమారీ ఆంటీ. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానని. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, టీడీపీ గెలిస్తేనే అది సాధ్యం అని స్పష్టం చేసింది.
గుడివాడ శాసనసభ స్థానం నుండి 2004, 2009లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన కొడాలి నాని 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తిరిగి 2014, 2019లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం అక్కడి నుండి ఐదోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు కొడాలి నాని, మరి కుమారీ ఆంటీ ప్రచారం వెనిగండ్ల రాము గెలుపుకు ఎంత వరకు బాటలు వేస్తుందో వేచిచూడాలి.