ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే అధికార దాహంతో ఉన్న వైసీపీ దేనికైనా తెగించేందుకు వెనుకాడటం లేదనే విమర్శలున్నాయి. ఓట్లు పొందేందుకు ప్రత్యర్థి పార్టీలపై తీవ్రమైన ఆరోపణలు, నాయకులపై దాడులతో పాటు జనాలను మభ్య పెడుతూ వైసీపీ సాగుతోందనే టాక్ ఉంది. ఇక వాలంటీర్లనే ప్రధానంగా నమ్ముకున్న వైసీపీ వాళ్లతో ఓట్లు పొందేందుకు వ్యూహాలు అమలు చేస్తుందని తెలిసింది. వాలంటీర్లతో ప్రచారం చేయించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించినా వైసీపీ పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లపై ఈసీ వేటు వేసినా మార్పు రాలేదు. అదీ కాకుండా కొంతమంది వాలంటీర్లు ఉద్యోగాలు వదిలేసి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
వాలంటీర్లే వైసీపీకి ఉన్న ప్రధాన దిక్కు అని చెప్పాలి. గ్రామస్థాయిలో ఒక్కో వాలంటీర్‌కు 50 ఇళ్ల వరకూ తెలుసు. ఆ ఇంట్లో వాళ్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఓట్ల వేటకు ఈ వాలంటీర్లను ప్రధాన అస్త్రంగా వైసీపీ వాడుతోందని తెలిసింది. ఆ పార్టీ అభ్యర్థులు ఈ వాలంటీర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. నగదు, వివిధ బహుమతులతో వాలంటీర్లను మభ్య పెడుతున్నారని సమాచారం. వాలంటీర్లకు వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో ఖరీదైన ఫోన్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలిసింది.
ఇక కోస్తా జిల్లాలోని ఓ నియోజకవర్గంలో వాలంటీర్లకు బైక్‌లు ఇచ్చేందుకూ వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని తెలిసింది. తమ విజయం కోసం పని చేయాలని, గెలిచిన వెంటనే బైక్‌లు కొనిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు పదవులకు రాజీనామా చేసిన వాలంటీర్లనూ వైసీపీ బాగా వాడుకుంటోంది. ఆయా గ్రామాల్లో వీళ్లతో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. జగన్ మళ్లీ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని, చంద్రబాబు అధికారంలో వస్తే ఎలాంటి ప్రయోజనం దక్కదని జనాలకు ఈ వాలంటీర్లు చెబుతున్నట్లు టాక్.