ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నాడా?…చంద్రబాబు ఫైర్

కొంతకాలంగా ఏపీలో హిందూ దేవాలయాలు, వాటి ఆస్తులపై వరుస దాడుల ఘటనలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్వేది ఘటనతో ఏపీతో పాటు దేశంలోని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, ఆ ఘటనపై ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించింది.

అయితే, ఇప్పటివరకు దేవాలయాలకు సంబంధించి జరిగిన అన్ని ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం కావడం, విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం వంటి ఘటనల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.

అసలు ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రభుత్వం ఉందా, మంత్రులు ఉన్నారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 11 ఆలయాలపై దాడులు జరిగాయని, ఈ రోజు హిందూ ఆలయాలు, రేపు చర్చిలు, మసీదులపై దాడులు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు బాధ్యత ఎవరు వహిస్తారని, ఆ ఘటనలు జరిగిన వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఆలయాలు, చర్చిలపై దాడులు జరిగితే కఠినంగా వ్యవహరించామన్నారు.

టీటీడీ ఆస్తుల అమ్మకంపై… దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చంద్రబాబు అన్నారు. వినాయకచవితి ఉత్సవాలకు అనుమతివ్వలేదని, వైఎస్‌ జన్మదిన వేడుకలకు మాత్రం అనుమతిస్తూ జీవో ఇచ్చారని విమర్శించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎస్వీబీసీ చానెల్‌ చైర్మన్‌ రాజీనామా చేశారని,శారదాపీఠం కార్యక్రమాలకు శ్రీవారి సొమ్ము ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ఆలయాల ఘటనలను కప్పిపుచ్చుకొని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. దుర్గగుడికి కూతవేటు దూరంలో మంత్రి వెల్లంపల్లి ఉన్నారని, ప్రభుత్వం, మంత్రులు లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్నా సీఎం జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, భక్తుల సంప్రదాయాలు, మనోభావాలను ప్రభుత్వం కాపాడాలన్నారు.

ఆలయాల ఘటనలపై సీఎం జగన్మోహన్ రెడ్డి తొలిరోజే స్పందిస్తే బాగుండేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భక్తుల నమ్మకాలను వమ్ము చేసే అధికారం జగన్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏం చేసినా చెల్లుతుందన్న గర్వంతో ముందుకెళ్తున్నారని, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే జరిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని, ప్రజాబలం ముందు వైసీపీ ప్రభుత్వం పారిపోక తప్పదని హెచ్చరించారు.

వైసీపీ మంత్రులు పద్ధతి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆలయాల ధ్వంసంపై ఏడురోజుల పాటు నిరసనలు తెలుపుతామని చంద్రబాబు అన్నారు. ఏపీలో జరిగిన ఆలయాల మీద దాడుల ఘటనలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూలేని వింత పోకడలు చూస్తున్నామని, అంతర్వేది ఘటనలో భక్తులు జైలులో ఉన్నారని, నిందితులు బయట ఉన్నారని అన్నారు.