ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి జనసేన కూటమికి మద్దతు దక్కుతున్న వైనాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే స్వయంగా పిఠాపురంలో తన తమ్ముడికి ఓటు వేయమని వీడియో మెసేజ్ రూపంలో పిలుపు ఇవ్వడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయిదు కోట్ల విరాళం ఇచ్చినప్పటి కన్నా ఇప్పుడీ బహిరంగ మద్దతు మరింత బలాన్ని అందించడం ఖాయం.
న్యాచురల్ స్టార్ నాని తన సపోర్ట్ ని పవన్ కళ్యాణ్ కి ట్వీట్ రూపంలో అందివ్వడం మరో విశేషం. గతంలో నాని చేసిన కొన్ని వ్యాఖ్యలను అనవసరంగా అపార్థం చేసుకుని ఒక వర్గం రాద్ధాంతం సృష్టించిన వైనం అభిమానులు మర్చిపోలేరు. నిత్యం పిఠాపురంలో జరుగుతున్న సెలబ్రిటీ ప్రచారం ఓటర్లలో మంచి కదలిక తీసుకొస్తోంది.
సాయి దుర్గ తేజ్, వరుణ్ తేజ్ ఎండల్లో తిరిగి క్యాంపైన్ చేశారు. హైపర్ ఆది, గెటప్ శీను, సుడిగాలి సుధీర్ తదితర హాస్య నటులు, హీరోలు వాడవాడలా తిరుగుతూ పబ్లిసిటీలో భాగమయ్యారు. జనసేన నుంచి పిలుపు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పవన్ కోసమే పని చేస్తామని తేల్చి చెప్పారు.
రాబోయే నాలుగైదు రోజుల్లో మరెన్నో మలుపులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందరో సినీ సెలబ్రిటీలు వివిధ రూపాల్లో జనసేన టిడిపికి మద్దతు ప్రకటించబోతున్నట్టు అంతర్గత వర్గాల సమాచారం. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలడు.
అందుకే రాజకీయం మొత్తం అక్కడే కేంద్రీకృతమయ్యిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు నటులు, స్టార్లు క్రమంగా ఒక్కొక్కరు ముందుకొచ్చి టీడీపీ జనసేనకు మద్దతుగా నిలవడం చూస్తే అనూహ్యమైన ఫలితాలు చూడబోతున్నామనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి.