పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం తెలిసిందే. నాగబాబు, ఆయన సతీమణి, కుమారుడు, మేనల్లుడు ఇలా.. వరుస పెట్టి చాలా మంది మెగా కుటుంబానికి చెందిన హీరోలు, నటులు పిఠాపురంలో పవన్ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగుతున్నారని.. మే 7న ఆయన పిఠాపురం వస్తున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే.. చిరంజీవి బిజీ షెడ్యూల్‌లో ఉన్నారో..ఏమో ఆయన భౌతికంగా మాత్రం పిఠాపురం రాలేదు. తాజాగా వీడియో సందేశం ఒకటి విడుదల చేశారు. దీనిలో తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని ఆయన ప్రజలకు విన్నవించారు. ‘అమ్మ కడుపులో ఆఖరికి పుట్టినా.. జనానికి మంచి చేయడంలో ముందుంటాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్ట సభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాని గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.
అధికారంలో లేకపోయినా.. తాను సంపాయించుకున్న సొంత సొమ్మును కౌలు రైతులకు, సైనికులకు అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి పంచి ఇచ్చిన పవన్‌ను ఆదరించాలని కోరారు. “పవన్ గళం అసెంబ్లీలో వినిపిస్తే.. మీకోసం పోరాడతాడు.. మీ కోసం కలబడతాడు. మీ సమస్యలపై పోరాటం చేస్తాడు. “ అని చిరు అన్నారు. అధికారంలో లేకపోయినా.. ఇంత చేశాడంటే.. ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఇంకెంత చేస్తాడో ఊహించుకోవాలన్నారు. సినిమాల్లోకి ఇష్టం లేకుండా వచ్చినా.. రాజకీయాల్లోకిఇష్టంతోనే వచ్చాడని అన్నారు. పిఠాపురం ప్రజలు ఆయనను ఆదరించాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates