ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరిలో చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర డీజీపీపైనే వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను తక్షణం బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. ఆన్‌లైన్‌లో ఆదేశాలు పంపించడం గమనార్హం. ఏపీ డీజీపీగా కొత్త అధికారిని ఎంపిక చేసేందుకు.. ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్‌ను తమకు పంపించాలని కూడా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీనిని కూడా.. సోమవారం ఉదయం 11 గంటల కల్లా తమకు పంపించా లని.. కోరింది. ఇక, ప్రస్తుత డీజీపీని బదిలీ చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం.. ఆయనకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలు అప్పగించాలని ఆదేశించడం విశేషం.
ఎవరీ డీజీపీ?
ప్రస్తుతం ఏపీకి డీజీపీగా ఉన్న అధికారి.. కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి. ఈయన పూర్తి స్థాయి డీజీపీ కాకపోవడం గమనార్హం. ఈయన తాత్కాలిక డీజీపీగానే.. గత రెండు సంవత్సరాలుగా కొన సాగుతున్నారు. అయితే.. శాశ్వత డీజీపీ నియామకంపై అటు కేంద్ర హోం శాఖ, ఇటు రాష్ట్ర ప్రబుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో ఆయనే కొనసాగుతున్నారు. ఇక, ప్రతిపక్షాలు ఈయనపై చేసిన ఆరోపణ లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని… ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారన్న ది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.