కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశా రు. శ్రీరాముడిని అవమానించిన రావణాసురుడు ఏమయ్యాడు. శ్రీరాముడిని అవమానించిన కుంభకర్ణుడు ఏమయ్యాడు? మారీచ సుబాహులు ఏమయ్యారు? ఇప్పుడు జగన్ కూడా అంతే! అని తీవ్రస్తాయిలో వ్యాఖ్య లు చేశారు. అయోధ్యలో భవ్యమైన రామమందిరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో 500 ఏళ్ల తర్వాత.. నిర్మితమైంది. మేం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. దీనికి రావాలంటూ.. సీఎం జగన్‌కు ఆహ్వానం పంపాం అని చెప్పారు.
“ఒక్క జగన్‌కే కాదు.. ప్రతిపక్ష నాయకులకు కూడా పంపించాం. చంద్రబాబు వచ్చారు. పవన్ జీ వచ్చారు. కానీ.. కాంగ్రెస్ నేత రాహుల్ బాబా మాదిరిగానే జగన్ బాబాకూడా రాలేదు. ఇది మాకు అవమానం కాదు.. ఆ రాముడికి అవమానం. రాముడిని అవమానించిన వారి వలె .. జగన్ కూడా మట్టిలో కొట్టుకుపోతాడు“ అని షా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న అమిత్‌షా.. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
“రాహుల్ బాబా దేవుడిని నమ్మడు. ప్రజలను కూడా నమ్మడు.. అందుకే అలా ఉన్నాడు. ఏపీలోనూ ఇదే జరుగుతోంది. జగన్‌బాబాకు దేవుడంటే.. ఇష్టం లేదు. ప్రజలంటే కూడా.. ఆయనకు ఇష్టం లేదు. అందుకే.. వీరిని ప్రజలు ఇంటికి పంపించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 13న ఏపీలో సునామీ రానుందని నాకు తెలుస్తోంది. దీనికి ముందు వచ్చిన జోరు వానలా మీరు కనిపిస్తున్నారు(సభకు వచ్చిన జనాలు)“ అని షా తెలిపారు.
ఇక, కూటమి అధికారంలోకి వస్తే.. చేసే పనులను కూడా ఏకరువు పెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోనే పోలవరం కడతామన్నారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని.. పూర్తి చేసేలా వెంటపడతామని చెప్పారు. అదేవిధంగా.. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని షా చెప్పారు. ఇళ్లు కట్టిస్తామని.. పేదలకు ఉచిత రేషన్ ఇస్తామని చెప్పారు. కూటమిని గెలిపించడం అంటే.. జగన్‌ను ఓడించడమే కాదని.. ప్రజలు తమను తాము గెలిపించుకున్నట్టు అవుతుందని ముక్తాయించారు. అయితే.. షా ప్రసంగంలో మేనిఫెస్టో గురించి.. ముస్లింల రిజర్వేషన్లు గురించి.. విభజన హామీల గురించి ప్రస్తావించలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates