బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో క్యాంపెయినర్‌గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
శ్యామలతోపాటు ఆమె భర్త గతంలోనే వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శ్యామలకీ, ఆమె భర్తకీ యాక్సెస్ బాగానే వుంటుందని వైసీపీ వర్గాలు అంటుంటాయి.
ఆ కారణంగానే, ఎన్నికల సమయంలో శ్యామల, ఆమె భర్త (ఈయనా టీవీ నటుడే) ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తప్పేముంది.? ఎవరైనా, ఏ పార్టీకి అయినా అనుకూలంగా ప్రచారం చేయొచ్చు. ఏ పార్టీలో అయినా చేరొచ్చు. రాజకీయ విమర్శలూ చేయొచ్చు.
శ్యామల కూడా అలాగే రాజకీయ విమర్శలు చేస్తోంది. అడవి, గుంట నక్క.. అంటూ ఏదో కథ చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామల. అది కాస్తా వైసీపీ శ్రేణుల పుణ్యమా అని వైరల్ అయ్యింది, శ్యామలపై విమర్శలకీ కారణమవుతోంది. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లుంటుంది రాజకీయాల్లో వ్యవహారం.
శ్యామల చెప్పిన కథకి కౌంటర్ ఎటాక్‌గా చాలా కథలు పుట్టుకొస్తున్నాయి. గతంలో శ్యామల భర్తపై నమోదైన చీటింగ్ కేసు, ఆయన అరెస్టు వ్యవహారం ఇవన్నీ ఇప్పుడు ఇంకోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీలో చేరాలంటే, ఇలాంటి కేసులు వుండాల్సిందే.. అదే వైసీపీలో చేరడానికి అర్హత.. ఆ అర్హత సాధించేశారు శ్యామలగారూ.. అని సెటైర్లేస్తున్నారు నెటిజనం.
ఏదిఏమైనా, శ్యామల రాజకీయ విమర్శల వ్యవహారం, వైసీపీకి ఏమాత్రం లాభం చేకూర్చే అవకాశం లేదు. ఆమె వల్ల పదో పాతికో ఓట్లు కూడా అదనంగా వచ్చే అవకాశం లేదు సరికదా, ఆమె భర్తపై చీటింగ్ కేసు వ్యవహారం.. వైసీపీకి ఇంకాస్త నెగెటివ్ అయ్యేలా వుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates