ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు గుర్తింపు సంపాదించిన నేత.. ముద్రగడ పద్మనాభం. 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడడంలో ఆయన పాత్ర కూడా కొంత ఉంది. టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ప్రయత్నం కొంతమేర ఫలించింది.

ఐతే వైసీపీకి పరోక్షంగా అండగా నిలిచిన ముద్రగడ.. పూర్తిగా రాజకీయ రంగు పులుముకోకుండా ఆ సమయంలో వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. కానీ ఎన్నికలు అయ్యాక జగన్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకపోవడం.. కాపులకు అన్యాయం జరిగిన విషయాల్లోనూ నోరెత్తకపోవడంతో ఆయన వ్యవహారశైలి వివాదాస్పదమైంది. అది చాలదన్నట్లు జనసేనకు అండగా నిలుస్తున్నట్లు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు తాను శ్రేయోభిలాషిని అన్నట్లు కలరింగ్ ఇస్తూ.. సరిగ్గా ఎన్నికల ముంగిట వైసీపీలో చేరి తాను జగన్‌కు సేవకుడిని అని ప్రకటించుకోవడంతో ముద్రగడ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది.

టీడీపీలో పొత్తులోకి వెళ్లబోతున్న పవన్‌కేమో సవాలక్ష కండిషన్లు పెట్టి.. తాను మాత్రం బేషరతుగా జగన్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు.. ఆయనకు తాను సేవకుడిని మారుతున్నట్లు ప్రకటించుకోవడం చూసి జనాలు విస్తుపోయారు. ముద్రగడ పవన్ మేలు కోరే వ్యక్తి కాదని ఈ సందర్భంగా స్పష్టమైంది. ఇక కాపుల హక్కులు, వారి ప్రయోజనాల సంగతే మాట్లాడుకుండా వైసీపీలో చేరిన రోజు నుంచి జగన్ భజన చేయడం, పవన్‌ను తిట్టిపోయడమే పనిగా పెట్టుకున్నారు ముద్రగడ. కనీసం రాష్ట్ర స్థాయి నేతగా వివిధ ప్రాంతాల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయడం పోయి.. కేవలం పిఠాపురానికి పరిమితం అయిపోయారు ముద్రగడ. అక్కడైనా జనాల్లో తిరిగారా అంటే అదీ లేదు. కేవలం ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి పవన్‌ను నానా మాటలు అనడం.. ముఖ్యంగా తన్ని తరిమేయాలి అనే వ్యాఖ్య చేయడంతో ముద్రగడ మీద కాపు కులంలోనే వ్యతిరేకత ఏర్పడిందన్నది స్పష్టం.

పవన్‌ను ఓడించాలన్న జగన్ కోరికను నెరవేర్చడం తప్ప మరో లక్ష్యమే లేనట్లు ముద్రగడ వ్యవహరిస్తున్నారు. కాపు ఉద్యమ నేతగా ఒకప్పుడు ఉన్న ఇమేజ్‌కి.. ఇప్పుడు ముద్రగడ వ్యవహరిస్తున్న తీరుకు అసలు పొంతన లేదు. చివరికి స్వయంగా ముద్రగడ కూతురే ఆయన్ని వ్యతిరేకిస్తూ వీడియో రిలీజ్ చేయడం.. దీనికి ప్రతిగా కూతురిని ‘ప్రాపర్టీ’ అని పేర్కొంటూ పెళ్లయ్యాక ఆమెతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం ముద్రగడ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ తీసేదే. మొత్తంగా చూస్తే ఆల్రెడీ క్రెడిబిలిటీ కోల్పోయి కాపుల్లో వ్యతిరేకత పెంచుకున్న ముద్రగడ.. ఇటీవలి వ్యవహార శైలితో పూర్తిగా రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకునేశారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.