ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో ఉన్న కూటమికి మరింత నమ్మకం కలగబోతోంది. అవును.. ఏపీలో విజయఢంకా మోగించేందుకు సిద్ధమవుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు ప్రధాని మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు.
చిలకలూరిపేటలో మోడీ సభతో ఏపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కూటమి హుషారుగా సాగిపోతోంది. ఇప్పుడు మరోసారి మోడీ వస్తుండటం కూటమికి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉంది. మే 6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్రచారం నిర్వహిస్తారు. 6న రాజమండ్రి సమీపంలోని వేమనగిరిలో సభలో పాల్గొంటారు. అనకాపల్లిలో రోడ్ షో నిర్వహిస్తారు. 8న పీలేరు అసెంబ్లీ పరిధిలోని కలికిరి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడలో రోడ్‌షో ఉంటుంది.
మోడీ రాకతో వైసీపీ టెన్షన్ మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫొటో లేదని, కూటమిలో ఉండటం బీజేపీకి ఇష్టం లేదని వైసీపీ ప్రచారం చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని జగన్ కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ వచ్చి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తే పరిస్థితి ఏమిటని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని భయపడుతున్నారని టాక్.