వివేకా కేసులో సంచ‌ల‌నం.. అవినాష్‌కు ఊర‌ట‌

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకానంద‌రెడ్డికేసులో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న క‌డ‌ప ఎంపీ.. వైసీపీ నాయ‌కుడు అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న పిటిష‌న్‌ను హైద‌రాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నిక‌ల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఇదేస‌మ‌యంలో ఆయ‌న సాక్షుల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌న్న వాద‌న‌ను కూడా తోసిపుచ్చింది.

ఇక‌, ఇదే కేసులో మ‌రో భారీ ఊర‌ట కూడా ల‌బించింది. ఇప్ప‌టివరుకు జైల్లో ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్క‌ర‌రెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నిక‌లకు ముందు ఇది మ‌రింత కీల‌క ప‌రిణామ‌మ‌నే చెప్పాలి. ఆయ‌న ఆరోగ్య కార‌ణాల‌తో దాఖ‌లు  చేసిన బెయిల్ పిటిష‌న్ మేర‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఇక‌, ఇదే కేసులో త‌మ‌కు కూడా బెయిల్ కావాల‌ని కోరుతూ.. ఉద‌య్ కుమార్‌రెడ్డి, సునీల్ కుమార్ యాద‌వ్‌లు దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ల‌ను హైకోర్టు కొట్టి వేసింది.

వివేకా కేసులో ఆయ‌న‌ను హ‌త్య చేసిన‌.. ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ఈయ‌న‌న పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ కూడా చేస్తున్నాడు. అయితే.. త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని.. త‌న‌ను జైల్లో ఉన్న‌ప్పుడు బెదిరించార‌ని.. డ‌బ్బులు ఎర చూపార‌ని పేర్కొంటూ.. పిటిష‌న్ వేశారు. ఈ క్ర‌మంలోనే అవినాష్ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని కోరాడు. దీనిపై విచార‌ణ చేసిన హైకోర్టు.. తాజాగా ఇచ్చిన తీర్పులో ఈ పిటిష‌న్‌ను కొట్టి వేసింది.