దేశంలో బెస్ట్ సీఎం జగన్:అలీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ కమెడియన్, వైసీపీ నేత అలీ భేటీ అయ్యారు. సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశానని, కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి తమ నాయకుడు వాకబు చేశారని అలీ మీడియాకు తెలిపారు. షూటింగ్స్ ప్రారంభం కావడానికి సమయం పడుతుందని సీఎం జగన్ కు వివరించినట్లు అలీ చెప్పారు.

యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ చిన్న వయసులోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తున్నారని అలీ ప్రశంసించారు. ప్రజలకు మంచి చేస్తున్నా కొందరు పనిగట్టుకొని విమర్శిస్తూనే ఉంటారని, సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అలీ అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎం జగన్ అని అలీ కితాబిచ్చారు.

2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ గుంటూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారని ప్రచారం జరిగింది. అయితే, కొన్ని సమీకరణాల రీత్యా అలీకి ఎమ్మెల్సీ కానీ, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవి కాని ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.

ఈ నేపథ్యంలోనే తన పదవి గురించి సీఎంతో చర్చించేందుకు అలీ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే అలీకి సీఎం జగన్ తగిన గుర్తింపు వచ్చేలా మంచి పదవి ఇవ్వబోతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అయితే, అలీతోపాటు విలక్షణ నటుడు పోసాని కూడా వైసీపీకి గట్టి మద్దతునిచ్చారు. దీంతో, పోసానికి కూడా ఏదో ఒక పదవి దక్కితే బాగుంటుదన్న అభిప్రాయాలు వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి.