టీడీపీలో ఎవ‌రిని క‌దిపినా.. లోకేష్ గురించే..

Lokesh

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో ఎవ‌రిని క‌దిలించినా.. ఆ పార్టీ యువ నాయ‌కుడు.. భావి అధ్య‌క్షుడిగా భాసిల్ల‌నున్న నారా లోకేష్ గురించే క‌థ‌క‌థ‌లుగా చెబుతున్నారు. అయితే, అదంతా పాజిటివ్ అయితే.. అంద‌రూ ఎప్పుడో ఎగిరి గంతులు వేసేవారు. కానీ, అన్నీ నెగిటివ్ స్టోరీలే! ఆయ‌న ప్ర‌చారం చేశారు.. మేం నిండా మునిగాం! అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఎన్నిక‌ల అనంత‌రం వ్యాఖ్యానించిన విష‌యం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఇక‌, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దాదాపు దూరంగా ఉన్న మాజీ మంత్రి, క‌ర్నూలుకు చెందిన కేఈ కృష్ణ‌మూర్తి కూడా అనేక సంద‌ర్భాల్లో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇక‌, ప్ర‌స్తుత రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి కూడా చిన్న‌బాబుపై మీడియా ముందు.. ఆఫ్‌ది రికార్డుగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. ఇలా ఒక‌రుకాదు.. ఇద్ద‌రు కాదు.. అనేక మంది నాయ‌కులు చిన్న‌బాబు గురించి ఆఫ్‌ది రికార్డుగా వ్యాఖ్య‌లు సంధిస్తూనే ఉంటారు.. వేళ్లు ఆయ‌న‌వైపే చూపిస్తుంటారు కూడా. తాజాగా పార్టీలో ఓ విష‌యంపై చ‌ర్చ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పార్టీ ఉన్న ప‌రిస్థితి నుంచి ఉన్న‌త ప‌రిస్థితికి తెచ్చేందుకు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించిన నేప‌థ్యంలో రాష్ట్రంలోనూ పార్టీకి కీల‌క‌మైన అధ్య‌క్షుడిని కొత్త‌వారిని పెట్టాల‌ని భావించారు.

ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రిని ఒక‌రిని ఈ విష‌యంపై సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. పార్టీలో మీ కుటుంబం ఎన్నోఏళ్లుగా ఉంది. పార్టీ మూలాలు కూడా మీకు బాగా తెలుసు. సో.. మీరు పార్టీని లీడ్ చేయండి.. అని చంద్ర‌బాబు స్వ‌యంగా ఆయ‌న‌ను కోరిన‌ట్టు తెలిసింది. అయితే, ఆయ‌న చంద్ర‌బాబు నిర్ణ‌యానికి ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోలేదు. అంతేకాదు, గొప్ప అవ‌కాశం చిక్కింద‌ని చంక‌లు కూడా గుద్దు కోలేదు. నిదానంగా.. ఒకే ఒక్క డైలాగ్ అన్నార‌ట‌. అధ్య‌క్షుడిగా నేను ఉంటే.. నేను తీసుకునే నిర్ణ‌యాల్లో ఎవ‌రూ.. వేలు పెట్ట‌కూడ‌దు. దీనికి ఓకేనా?! అన్నార‌ట‌!

స‌ద‌రు నాయ‌కుడు ఎవ‌రూ అన్నారంటే.. అది ఖ‌చ్చితంగా లోకేషేన‌ని త‌మ్ముళ్లు చెవులు కొరుక్కున్నారు. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న క‌ళా వెంక‌ట్రావు ఏ చిన్న ప‌నిచేయాల‌న్నా. ఆఖ‌రుకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల‌న్నా కూడా చిన‌బాబు అనుమ‌తి తీసుకోవాల్సిందే. ఈ ప‌రిస్థితిని దాదాపు ప‌దేళ్లుగా చూస్తున్నారు.. కాబ‌ట్టి.. ఈ నాయ‌కుడు ముందుగానే జాగ్ర‌త్త ప‌డ్డారే! అని త‌మ్ముళ్లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి పార్టీలో సంస్థాగ‌త లోపాల‌ను స‌రిచేయాల్సిన నాయ‌కుడు.. తానే స‌మ‌స్య‌ల‌కు కార‌ణంగా నిలుస్తున్నార‌నే వాద‌న వినిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

All the Streaming/OTT Updates you ever want. In One Place!