ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం తప్ప.. ఆకర్షణీయ హామీలేమీ ఇవ్వకపోవడం పట్ల జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేనిఫెస్టో చూసి వైసీపీ శ్రేణులు కొంత నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
కానీ చెప్పేవే చేస్తాడు జగన్.. అందుకే అలవిమాలిన హామీలివ్వలేదని వైసీపీ వాళ్లు సమర్థించుకుంటున్నారు. కాగా ఇప్పుడు ఎన్డీయే కూటమి మేనిఫెస్టోతో జనాల ముందుకు వచ్చింది. ఆల్రెడీ టీడీపీ సొంతంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడు కొత్తగా వివిధ వర్గాలకు అనేక ఆకర్షణీయ హామీలు ప్రకటిస్తూ మేనిఫెస్టోను కూటమి విడుదల చేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రతినిధిగా సిద్దార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఐతే మీడియా ముందు మేనిఫెస్టో బ్రోచర్లను ప్రదర్శించిన సమయంలో బాబు, పవన్ మాత్రమే వాటిని పట్టుకుని నిలబడ్డారు. నరేంద్రనాథ్‌కు ఒక కాపీ ఇవ్వబోతే ఆయన తిరస్కరించారు. తద్వారా ఈ మేనిఫెస్టోకు బీజేపీ బాధ్యత వహించదని చెప్పకనే చెప్పినట్లు అయింది.
చంద్రబాబు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రం తరఫున ఒక మేనిఫెస్టోను ప్రకటించిందని.. రాష్ట్రాలకు వేరుగా మేనిఫెస్టోలు ఇవ్వట్లేదని.. అందుకే ఈ మేనిఫెస్టోకు వాళ్లు దూరంగా ఉన్నారని.. కానీ హామీల అమలుకు కేంద్రం, బీజేపీ తరఫున పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి కూటమిలో బీజేపీ భాగమే కానీ.. మేనిఫెస్టోలో మాత్రం ఆ పార్టీ భాగస్వామ్యం కానీ, బాధ్యత కానీ ఏమీ లేదన్నమాట.