ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి కూర్చుంటుంది. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఇలానే జరుగుతోంది. ఆయనేదో తన చెల్లెలు.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలపై జాలి చూపించాలని అనుకున్నారో.. లేక.. షర్మిలపై ప్రేమ కురిపించాలని అనుకున్నారో.. ఓ నేషనల్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“కడపలో మీ చెల్లెలు గెలుస్తుందా?” అని అడిగిన ప్రశ్నకు సీఎం జగన్ వెంటనే చెప్పిన జవాబు.. “ఆమె కు డిపాజిట్ కూడా రాదు” అని. అయితే.. అక్కడితో ఆయన ఆగిపోలేదు. దీనికి కొనసాగింపుగా.. కడప ప్రజలకు ఎవరు ఎంటో తెలుసని.. షర్మిలకు డిపాజిట్ కూడా రాదని.. అదే తనను బాధిస్తోందని.. జాలి కూడా కలిగేలా చేస్తోందని చెప్పారు. అయితే.. ఈ వ్యాఖ్యల వల్ల జగన్ ఏం ఆశించారో.. తెలియదు కానీ.. ఆయనకు .. మాత్రం షర్మిల నుంచి బలమైన కౌంటర్ వచ్చింది. అంతేకాదు.. ఆమె దీనిని ప్రజల్లోకి కూడా తీసుకువెళ్లారు.
షర్మిల తాజాగా ఏమన్నారంటే.. “నీ చెల్లిపై నీకు నిజంగా ప్రేమ ఉంటే.. నీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని నామినేషన్ వెనక్కి తీసుకునేలా చెయ్యి” అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు.. అవినాష్ రెడ్డి నామినేషన్ వెనక్కి తీసుకుంటే.. నీకు నీ చెల్లెళ్లపై ప్రేమ ఉందని.. కనీసం వివేకానందరెడ్డి చనిపోయాడన్న.. బాధైనా ఉందని ప్రజలు నమ్ముతారని చెప్పుకొచ్చారు. లేకపోతే.. నీ అంత దుర్మార్గుడు మరొకరు ఉండరని ప్రజలు నమ్ముతారని చెప్పారు. ఈ విషయాన్ని తాము ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామన్నారు.
కడప ప్రజలకు అంతా తెలుసునని అంటున్న జగన్.. ఏం తెలుసో చెప్పాలని అన్నారు. ఇదే సమయం లో షర్మిల తన వదిన.. సీఎం జగన్ భార్య భారతిపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. “జగన్ రెండు రిమోట్ల మధ్య తిరుగుతున్నాడు. ఒకటి ఢిల్లీ రిమోట్. రెండో ఇంట్లో రిమోట్. ఢిల్లీలో రిమోట్ అయినా..(బీజేపీ), ఇంట్లో రిమోట్(భారతి) అయినా.. `బీ` అక్షరంతోనే ప్రారంభమవుతాయి” అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates