ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన.. ఇబ్బంది తప్పదు. తాజాగా ముద్రగడ పద్మనాభం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను ఓడించకపోతే.. పేరు మార్చుకుంటానని అనేశారు. ఇదేసమయంలో ఆయన ఒక లాజిక్‌లేని వ్యాఖ్య కూడా చేశారు. పవన్‌ను ఏ అర్హత ఉందని పిఠాపురంలో పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.
ఎక్కడో హైదరాబాద్‌లో ఉండే… పవన్ వచ్చేస్తే.. ఇక్కడ గెలిపించాలా? ఇక్కడ ఆయనకు ఓట్లేయాలా? అని ముద్రగడ తన అక్కసు వెళ్ల గక్కారు. కానీ, ఈ దేశంలో ఎక్కడి వారు ఎక్కడైనా పోటీ చేయొచ్చన్న విషయం ఆయనకు తెలియదంటే ఎవరూ నమ్మరు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఇందిరమ్మ.. 1978 ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం ఆయన మరిచిపోయి అయినా.. అయి ఉండాలి.. లేకపోతే.. నటిస్తున్నారని అనుకోవాలి.
పోనీ.. ఆ సంగతి వదిలేస్తే.. ఎక్కడో గుజరాత్‌కు చెందిన ప్రధాని మోడీ.. యూపీలో వారణాసి నుంచి వరుసగా పోటీ చేస్తూనే ఉన్నారు. రెండు సార్లు విజయం కూడా అందుకున్నారు. పోనీ.. ఈయన విషయాన్ని పక్కన పెడితే.. కాంగ్రెస్‌కు చెందిన అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ వారసత్వంగా వచ్చిన అమేధీ నియోజకవర్గాన్ని వదిలేసి.. ఎక్కడో కేరళలో ఉన్న వయనాడ్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ విజయం దక్కించుకున్నారు. మరి వీరంతా స్థానికులా? అనేది ముద్రగడ చెప్పాలి.
ఇక, వైసీపీకే వచ్చినా.. ఎక్కడో హైదరాబాద్‌లో ఉంటున్న సింహాద్రి చంద్రశేఖర్‌ను వద్దని అంటున్నా.. తీసుకువచ్చి.. మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు. దీనికి ముద్రగడ ఏం చెబుతారు? అంతేకాదు.. అసలు మన రాష్ట్రంతోనే సంబంధం లేని.. కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్‌రెడ్డి బందువు.. జోలదరాశి శాంతను తీసుకువచ్చి.. హిందూపురం ఎంపీగా వైసీపీ టికెట్ ఇవ్వలేదా? దీనికి ముద్రగడ సమాధానం చెప్పగలరా? వారికి ఎందుకు ఓటేయాలని టీడీపీ అంటే.. సమాధానం ఇవ్వగలరా?
సో.. దేశ చరిత్రలో నాయకులు ఎక్కడ నుంచి ఎక్కడైనా పోటీ చేయొచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 స్పష్టంగా చెబుతోంది. ఇలాంటప్పుడు.. వ్యక్తిగత కక్షలు పెట్టుకుని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా.. ఉన్న పరువును మరింత దిగజార్చుకోవడమే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.