వారికి గాజు గ్లాసు గుర్తు ఎలా కేటాయిస్తారు?:  హైకోర్టు సీరియ‌స్‌

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రంలో చిత్ర‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ప్ర‌దాన పార్టీ జ‌న‌సేన‌కు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును.. ఆ పార్టీ పోటీలో లేని చోట దాదాపు 18 మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థులకు ఈ గుర్తునే కేటాయించారు. ఇది కేంద్ర ఎన్నిక‌ల సంఘ చేసిన ప‌ని. ఆయా అభ్య‌ర్థుల వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది ప‌క్కన పెడితే.. ఒక రాష్ట్రంలో ఒక కీల‌క పార్టీకి కేటాయించిన గుర్తును.. ప్ర‌త్య‌ర్థుల‌కు కేటాయించ కూడ‌ద‌నేది సూత్రం.

కానీ, రిజిస్ట‌ర్డ్ పార్టీ కాద‌నే కార‌ణంగా.. జ‌న‌సేన‌కు కేటాయించి గాజు గ్లాసు గుర్తునే.. స్వ‌తంత్రుల‌కు కేటాయించింది. చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంక‌ర్రావు.. త‌న‌యుడు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి స్వ‌తంత్రంగా పోటీ చేస్తున్న పెద‌కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా.. ఆయ‌న‌కు గాజు గ్లాసు గుర్తునే కేటాయించారు. ఇక‌, చంద్ర‌బాబు పోటీలో ఉన్న కుప్ప‌లో న‌వ‌రంగ్ పార్టీ త‌ర‌ఫున స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న మ‌హిళా నాయ‌కురాలికి కూడా.. ఈ గుర్తునే ఇచ్చారు.

దీంతో కీల‌క పార్టీ అధ్య‌ర్థుల ఓట్లు చీలిపోతాయ‌నే బెంగ కూట‌మి పార్టీల‌ను వెంటాడుతోంది. ఈ నేప‌థ్యం లో జ‌నసేన హుటాహుటిన హైకోర్టు త‌లుపు త‌ట్టింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ.. పిటిష‌న్ వేసింది. దీనిని తాజాగావిచారించిన హైకోర్టు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఒకే గుర్తును ఇంత మందికి ఎలా కేటాయిస్తార‌ని నిల‌దీసింది. దీనిని త‌క్ష‌ణ‌మే మార్చ‌క‌పోతే.. తామే ఆదేశాలు ఇస్తామ‌ని తెలిపింది. అయితే.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు సేక‌రించాల్సి ఉంద‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌ర‌ఫు న్యాయ‌వాది వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన కోర్టు విచార‌ణ‌ను బుధ‌వారానికి వాయిదా వేసింది.