ఈ రోజుల్లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్లకు వచ్చే జనం సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. వసూళ్లు ఏమాత్రం ఆశాజనకంగా ఉండట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ దారుణంగా ఉంది. ఇంతకుముందులా డిజిటల్ హక్కులు అంత సులువుగా అమ్ముడవ్వట్లేదు. వాటి రేట్లు కూడా పడిపోయాయి.
యంగ్ హీరోలే చాలా ఇబ్బంది పడుతుంటే.. జనం మరిచిపోయిన ఒక హీరో లీడ్ రోల్‌లో సినిమా చేయడమే కాక, దాన్ని సొంతంగా ప్రొడ్యూస్ చేశాడు కూడా. ఆ హీరో వడ్డే నవీన్ కాగా, ఆయన హీరోగా నటించిన చిత్రం.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.
ఒకప్పుడు పెళ్ళి, ప్రియా ఓ ప్రియా, మనసిచ్చి చూడు, చాలా బాగుంది లాంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు వడ్డే నవీన్. ఇలాంటి హిట్లు పడినా.. ఆయన స్టార్‌గా మాత్రం ఎదగలేకపోయాడు. చివరగా నవీన్ నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమా అంటే 2005లో రిలీజైన ‘నా ఊపిరి’నే.
ఆ తర్వాత పూర్తిగా మార్కెట్ కోల్పోవడంతో సినిమాలు తగ్గిపోయాయి. ఎటాక్ సహా కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. 2010లో వచ్చిన ‘శ్రీమతి కళ్యాణం’లో నవీన్ చివరగా హీరోగా నటించాడు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత ఆయన లీడ్ రోల్ చేసిన సినిమా.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. ఈ చిత్రానికి నిర్మాత కూడా నవీనే.
‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ నుంచి తాజాగా టీజర్ లాంచ్ అయింది. పదేళ్ల సర్వీస్‌లో 45 సార్లు ట్రాన్స్‌ఫర్ కావడంతో కానిస్టేబుల్ త్రిమూర్తులు కాస్తా.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు అవుతాడు. అతను టేకప్ చేసిన ఒక కేసు సెన్సేషన్ క్రియేట్ చేసి అతను కుటుంబంతో అదృశ్యం అవుతాడు. అతణ్ని పట్టుకోవడానికి పెద్ద వ్యవస్థ పని చేస్తున్నా.. దొరక్కుండా తాను అనుకున్నది సాధిస్తాడు హీరో. ఇదీ టీజర్ చూస్తే కథ మీద వచ్చే ఐడియా.
ఇన్నేళ్ల తర్వాత నవీన్ హీరోగా చేస్తున్నాడంటే ఏదైనా కొత్త కథ ట్రై చేసి ఉంటాడేమో అనుకుంటే.. ఆ ఛాయలేమీ ఇందులో కనిపించలేదు. కెరీర్లో ఈ దశలో ఇలాంటి హీరోయిజం ఉన్న, మాస్ టచ్ ఉన్న కథతో నవీన్ మాత్రం జనాలను మెప్పిస్తాడన్నది ప్రశ్నార్థకం.
ఈ మధ్య నాగశౌర్య లాంటి యంగ్ హీరో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే మాస్ మూవీ చేస్తే తొలి రోజు జనం లేక షోలు పడని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డే నవీన్ మాస్ సినిమా చేస్తే జనం ఏమాత్రం ఆకర్షితులవుతారో చూడాలి. నవీన్ సరసన రాశి సింగ్ నటించిన ఈ చిత్రాన్ని కమల్ తేజ నార్ల రూపొందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates