రఘురామ కొత్త పార్టీ పెడుతున్నారా?

అదేంటో గానీ… సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతోంది. రాజు గారు నోరు తెరిస్తే చాలు అది సంచలనం అయిపోతోంది. ఇక రాజు గారు ఏమైనా చేశారంటే… దానిపై ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు ఒకటి జరిగింది.

రాజు గారు కొత్తగా ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారని గడచిన రెండు రోజులుగా ఓ రేంజిలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం విన్న రాజు గారు ఆశ్చర్యానికి లోనై… ఈ విషయంపై జరుగుతున్న చర్చ అంతా అవాస్తవమని, తాను ఏర్పాటు చేసింది రాజకీయ పార్టీని కాదని, కేవలం ఓ స్వచ్ఛంద సంస్థ అని ఆయన వివరణ ఇచ్చారు.

ఈ మేరకు రాజు గారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 4.36 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో అసలు తానేం చేశానన్న విషయంతో పాటుగా తాను చేసిన పనిని ఇతరులు ఎలా భావించారన్న విషయాలను ఆయన సమగ్రంగా వివరించారు. మత సంబంధిత, ఇతరత్రా సామాజిక అంశాలకు సంబంధించి అన్యాయానికి గురైన వారికి న్యాయపరంగా సహకారం అందించేందుకు ఓ చిన్న ఫోరమ్ ను తాను ఏర్పాటు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. దానికి తెలుగు వీర లేవరా అన్న పేరును పెట్టినట్టు ఆయన తెలిపారు.

ఈ సంస్థలో అనుభవం కలిగిన ఇద్దరు, ముగ్గురు న్యాయవాదులను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు రాజు గారు చెప్పారు. ఈ సంస్థ నుంచి ప్రజలకు ఉచితంగానే సేవలు అందించేందుకే ఈ ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన చెప్పారు. ఈ సంస్థకు ఎలాంటి రాజకీయాలతో ఎంతమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తాను ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలోనే ఈ సంస్థను ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. అయితే ఈ సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో ఎంతమాత్రం సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక తానెందుకు రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానన్న విషయంపైనా రాజు గారు ఓ సవివర వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నానని చెప్పిన రాజు గారు…తనను నమ్మి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వంటి చట్టబద్ద బాధ్యతలను అప్పగించారన్నారు.

ప్రస్తుతం తాను రాజకీయంగా పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. పార్టీ అదినేతతో పాటు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత తనకు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.