ఒకప్పుడు అన్యోన్యంగా ఉన్న వైఎస్ కుటుంబ అన్నా చెల్లెళ్లు ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయి రాజకీయ రణరంగంలో తలపడుతున్న సంగతి తెలిసిందే. జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతుంటే.. ఒకప్పుడు తన తండ్రి సారథ్యం వహించిన, జగన్ విభేదించి బయటికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో షర్మిళ అధ్యక్షురాలు. అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.
జగన్ మద్దతుతో వైసీపీ తరఫున ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచే షర్మిళ కూడా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ వివేకాను చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్‌ను ఓడించాలని, అవినాష్‌కు మద్దతుగా నిలుస్తున్న జగన్‌కు బుద్ధి చెప్పాలని షర్మిళ కోరుతుండగా.. జగన్ అండ్ కో నుంచి ఈ విషయంలో ఎదురుదాడి కూడా గట్టిగానే జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో షర్మిళ డిపాజిట్ కోల్పోనుందంటూ జగన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇవాళ ఇండియా టుడే తరఫున జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా షర్మిళ ప్రస్తావన రాగా.. తనకున్న సమాచారం ప్రకారం ఆమె డిపాజిట్ కోల్పోనుందని.. ఇది తనకు ఎంతో బాధ కలిగించే విషయమని.. ఆమె పోటీ చేస్తోంది అలాంటి పార్టీ నుంచి అని జగన్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అంటే వైఎస్ పేరు ఛార్జ్‌షీట్‌లో చేర్చిన పార్టీ అని.. అలాగే తన మీద తప్పుడు కేసులు పెట్టించిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడిపిస్తున్నది చంద్రబాబే అని.. చంద్రబాబు, ఆయన శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి షర్మిళను తప్పుదోవ పట్టించి తన మీదికి ఉసిగొల్పుతున్నారని.. ప్రజలకు ఈ కుట్ర తెలుసు కాబట్టే షర్మిళ వైపు నిలవరని ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates