పోసానికి షాక్… ఫ్యామిలీ అంతా చంద్రబాబు వైపు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నిరంత‌రం మీడియాలో ప్ర‌చారం చేస్తున్న వైసీపీ నాయ‌కుడు, సినీ న‌టుడు, ర‌చ‌యిత‌, నిర్మాత పోసాని కృష్ణ‌ముర‌ళికి సొంత కుటుంబంలోనే భారీ షాక్ తగిలింది. ఆయ‌నేమో.. నిరంత‌రం సీఎం జ‌గ‌న్ భ‌జ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ ఫిల్మ్  డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న పోసాని.. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్త‌స్తున్నారు. ఇదేసమ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై నిరంతరం విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కానీ, అనూహ్యంగా పోసాని కుటుంబం మాత్రం చంద్ర‌బాబుకు జై కొట్టింది. అంతేకాదు.. మ‌రోసారి ఏపీ సీఎం జగన్ అయితే.. త‌ప్ప రాష్ట్రానికి ద‌శ‌, దిశ ఉండ‌ద‌ని కూడా తేల్చి చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. తాజాగా పోసాని కృష్ణ‌ముర‌ళి త‌మ్ముడి కుమారుడు.. పోసాని యోగేంద్ర‌నాథ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చంద్ర‌బాబును క‌లిసిన ఆయ‌న త‌న అభిమానాన్ని వ్య‌క్త ప‌రిచి.. రూ.20 ల‌క్ష‌ల పార్టీ ఫండ్‌ను కూడా అందించారు. చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకొన్నారు.

అంతేకాదు.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట‌(పోసాని సొంత నియోజ‌క‌వ‌ర్గం) స‌హా గుంటూరు , న‌ర‌సారావుప‌పేట నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తాన‌ని కూడా యోగేంద్ర‌నాథ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు వంటి నాయ‌కుడిని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉంద‌న్నారు. ఆయ‌న విజ‌న్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తార‌ని తేల్చిచెప్పారు. అందుకే తాను సైకిల్ ఎక్కిన‌ట్టు చెప్పారు. టీడీపీలో చేరి.. పార్టీ విజ‌యానికి కృషి చేస్తాన‌న్నారు. కాగా, బ్రిట‌న్‌లో వ్యాపారాలు చేస్తున్న యోగేంద్ర‌నాథ్‌.. చంద్ర‌బాబు హ‌యాంలో హైద‌రాబాద్‌లోనూ ఇక్క‌డ వ్యాపారాలు ప్రారంభించారు.  ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న టీడీపీ కండువా క‌ప్పుకొన్న‌ట్టు చెప్పారు.