వీటిపై క్లారిటీ ఏది జ‌గ‌న్‌?!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మేనిఫెస్టో ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు కూడా చేస్తున్నారు. ఆదివా రం వ‌రుస‌గా మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. అది కూడా అనంత‌పురం జిల్లానే ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌ల్లో చంద్ర‌బాబును న‌మ్మొద్ద‌ని.. ఆయ‌నను న‌మ్మ‌డ‌మంటే.. పులినోట్లో త‌ల పెట్ట‌డ‌మేన‌ని చెబుతున్నారు. ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క‌టీ చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేద‌ని.. ఇక‌పైనా చేయ‌బోడ‌ని అన్నారు. కాబ‌ట్టి చంద్ర‌బాబు ఇంటింటికీ బంగారం ఇస్తాన‌ని చెప్పినా న‌మ్మొద్ద‌న్న సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

ఇక‌, త‌న మేనిఫెస్టో 2.0ను మ‌రోసారి భ‌గ‌వ‌ద్గీత‌.. బైబిల్‌.. ఖురాన్‌గా అభివ‌ర్ణించారు. గ‌త మేనిఫెస్టోలో ఇచ్చిన ప్ర‌తి హామీనీ అమ‌లు చేశామ‌ని.. 99 శాతం చెప్పిన‌వి చేశామ‌న్నారు. ఇక‌, ఇప్పుడు తీసుకువ‌చ్చిన మేనిఫెస్టోలోనూ ఉన్న‌వి ఉన్న‌ట్టే అమ‌లు చేస్తామ‌న్నారు. చేయ‌లేనివి చెప్ప‌లేద‌న్నారు. మొత్తంగా త‌న నూత‌న మేనిఫెస్టోపై జ‌నాల‌కు ఉప‌న్యాసం ఇచ్చారు. అయితే.. ఇక్క‌డ కీల‌క‌మైన ప్ర‌శ్న‌లకు జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అవే ఇప్పుడు జ‌నాల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి.. ప‌థ‌కాలు కాదు.. ధ‌ర‌లు!!

ఇవీ జ‌నాలు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు
+ ఇప్ప‌టికే 9 సార్లు పెంచిన విద్యుత్ చార్జీల‌ను ఇంకెన్ని సార్లు పెంచుతారు?  దీనికేమైనా అడ్డుక‌ట్ట వేస్తారా?  లేదా.. పెంచుకుంటూ పోతారా?

+ చెత్త‌ప‌న్నును ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తున్నారు. దీనిపై ఎందుకు స‌మాధానం చెప్ప‌డం లేదు. ప్ర‌తి మూడు మాసాల‌కు దీనిని పెంచుతున్నారు. ఇక ముందూ ఇది కొన‌సాగుతుందా?

+ ఆస్థిప‌న్నును మ‌రింత పెంచి ప్ర‌జ‌ల న‌డ్డి విరిచారు. దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు.

+ ఆర్టీసీ చార్జీల‌ను పెంచారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో పెంచుతారా?  తుంచుతారా?

+ ప్ర‌తి దానిపైనా ప‌న్నులు వేస్తున్నారు. వీటిపై క్లారిటీ ఏదీ?

+ విద్యుత్‌కు మీట‌ర్లు ఉన్న‌ట్టే.. గృహ వినియోగ తాగునీటికి కూడా మీట‌ర్లు పెడ‌తార‌నే చ‌ర్చ సాగుతోంది. దీనిపై క్లారిటీ ఏంటి?

+ రైతులు వినియోగిస్తున్న సాగునీటికి కూడా మీట‌ర్లు పెడ‌తామ‌ని చెబుతున్నారు. దీనిపై స‌మాధానం ఏంటి?

+ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌.. మ‌త‌ల‌బు ఏంటి?  దీనిని తీసేయాల‌ని చెబుతున్నా.. ఎందుకు కొన‌సాగిస్తున్నారు?

+ రాజ‌ధాని విశాఖ అయితే.. అమ‌రావ‌తి రైతుల ప‌రిస్థితి ఏంటి?  దీనిని ఏం చేస్తారు?  వారిచ్చిన భూముల సంగ‌తేంటి?

+ పెట్రోలు, డీజిల్ ప‌న్నులపై బాదుడు మాటేంటి?

+ ఇసుక విధానం గురించి ఏం చేస్తారు. ఇక ముందు కూడా ఇంతేనా?

+ ఉద్యోగ క‌ల్ప‌న లేదు.. ఉపాధి ఊసు లేదు.. వీటిని ఏం చేయ‌నున్నారు?