తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉండి శాసనసభ స్థానంలో ఈసారి గెలుపు ఎవరిది? సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు, పాత ఎమ్మెల్యేను కూడా పక్కనపెట్టి కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందా? తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై క్యాడర్ అసంతృప్తిగా ఉందా ? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.
2009,2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివకు 2019లో టీడీపీ నర్సాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయాడు. 2019లో ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కిన రామరాజు విజయం సాధించాడు. ఈసారి ఈ టికెట్ రామరాజుతో పాటు శివ ఆశించాడు.
అయితే ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులుగా వీరిద్దరినీ పక్కనపెట్టి రఘురామకృష్ణంరాజుకు టీడీపీ అవకాశం కల్పించింది. దీంతో కలవపూడి శివ అసంతృప్తితో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. అందరితో కలుపుగోలుగా ఉండే శివ వైపు టీడీపీ క్యాడర్ చూస్తున్నట్లు సమాచారం. గతంలో రామరాజు, కలవపూడి శివల మధ్య సాన్నిహిత్యం ఉండేది.
ఈసారి సంబంధంలేని రఘురామకృష్ణంరాజు తెరమీదకు రావడం టీడీపీ క్యాడర్ పెద్దగా పట్టించుకోవడం లేదు. 2019 జగన్ ప్రభంజనంలోనూ ఉండిని టీడీపీ నిలబెట్టుకుంది. అయితే కలవపూడి శివ పోటీ నేపథ్యంలో ఆయన భారీగా ఓట్లు చీలిస్తే ఇక్కడ వైసీపీ జెండా ఎగరేయవచ్చన్న ఆశతో ఆ పార్టీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు ఉన్నారు. మొత్తానికి ఇక్కడ ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates